Oct 12,2023 20:32

ఆరోగ్య సురక్షలో రోగిని తనిఖీ చేస్తున్న ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ శంకరరావు

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం, బెలగాం :  విద్యలో అవకాశాలు అందిపుచ్చుకోవాలని రాష్ట్ర గిరిజన తెగల (ఎస్టీ) కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డివిజి శంకరరావు అన్నారు. జిల్లా పర్యటనకు గురువారం విచ్చేసిన ఆయన పార్వతీపురంలో జోగింపేట కాలేజ్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను సందర్శించారు. అనంతరం గుమ్మలక్ష్మీపురం మండలంలో పర్యటించారు. కాలేజ్‌ అఫ్‌ ఎక్సలెన్స్‌ను సందర్శించిన కమిషన్‌ చైర్మన్‌ విద్యార్థులతో మాట్లాడారు. ఉన్నత విద్యను అందిపుచ్చుకోవాలని సూచించారు. వైద్యం, ఇంజినీరింగ్‌, శాస్త్ర సాంకేతిక రంగాలు, సోషల్‌ సైన్సెస్‌ తదితర రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న రంగాలను ఎంపిక చేసుకొని వాటిలో నైపుణ్యాలు సాధించాలని అప్పుడే ప్రపంచం మీ సొంతమవుతుందని చెప్పారు. చదువులపై దష్టి సారిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. విద్యార్థులకు ఆహార పదార్థాల తయారీలో ఎటువంటి అశ్రద్ద ఉండరాదని స్పష్టం చేశారు. గుమ్మలక్ష్మీపురంలోని ఆశ్రమ పాఠశాలలో సదుపాయాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థి ఉత్తమ విద్యార్థిగా పోటీ పరీక్షల సాధకునిగా మారాలని, అందుకు ఉపాధ్యాయులు ఉత్తమ శిక్షణకు నడుం బిగించాలని ఆయన అన్నారు. విదేశీ విద్యను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా తీర్చిదిద్దాలని ఆయన చెప్పారు.
గిరిజన సమస్యలు పరిష్కరించండి
గుమ్మలక్ష్మీపురం మండలంలోని వివిధ పాఠశాలను కమిషన్‌ చైర్మన్‌ సందర్శించారు. గిరిజనులు, వివిధ సంఘాల నుంచి అర్జీలను స్వీకరించారు. గిరిజనులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిపిఐ వినతిని అందజేసింది. మండలంలో 350 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, తిత్తిరి పంచాయతీ పరిధిలో ఏనుగుల సంచారం, గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను, తిండి గింజలను ధ్వంసం చేస్తూ, రాత్రిళ్ళు గిరిజన గూడెంలోకి వచ్చి దాడి చేయడంతో గిరిజనులు భయపడుతున్నారని, ఏనుగులు సమస్యను పరిష్కరించాలని కోరారు.
వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేసిన ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌
స్వతహాగా వైద్యులు అయిన రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డివిజి శంకరరావు చెముడుగూడలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు వైద్య సేవలు అందించారు. అనంతరం కన్నయ్యగూడలో సవర భాష పాఠశాలను తనిఖీ చేశారు. గుమ్మలక్ష్మిపురం మండల పరిషత్‌ కార్యాలయంలో అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, అయితే స్వయంగా పర్యటించడం వల్ల మరికొన్ని సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి ప్రభుత్వం దష్టిలో పెడతామని అన్నారు. నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని, ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుందని ఆయన చెప్పారు. ఏనుగుల సమస్యపైన, తాగునీరు, రహదారులు వంటి మౌళిక సదుపాయాలు పట్ల ప్రభుత్వం దష్టికి తీసుకువెళతామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కురుపాం ఎమ్మెల్యే పి.పుష్ప శ్రీవాణి కమిషన్‌ చైర్మన్‌ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి కె శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.