Oct 21,2023 19:52

ఆదోని తహశీల్దార్‌ కార్యాలయం

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
ఆదోని తహశీల్దార్‌ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది. మామూళ్లు ఇవ్వనిదే అక్కడ ఏ పనులు జరగవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు తెలిసింది. అటెండర్‌ నుంచి అధికారుల వరకు ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
మండలంలోని మారుమూల గ్రామంలో సుమారు 6 ఎకరాల భూమిపై కోర్టులో ఉన్న భూమికి ఎంజారుమెంట్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడంలో రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు దండుకున్నట్లు సమాచారం. మరో అధికారి తహశీల్దార్‌ కిందిస్థాయి అధికారైనప్పటికీ అంతా తానే నడిపిస్తున్నట్లు, ప్రతి పనికీ ఓ రేటు పెట్టి వసూలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పేదలకు ఇచ్చిన ఇంటి పట్టాలపై మరో ఇంటి పట్టా సృష్టించడం, ఇద్దరి మధ్య వివాదం పెట్టి దాని పరిష్కరిస్తున్నట్లు చేసి ఒకరికి న్యాయం చేసే విధంగా అధికారి చలామణి అవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ పని చేయాలన్నా అధికారి చేయి తడపనిదే ఫైలు కదలదు. మరో విఆర్‌ఒ ఒక పట్టాదారు పాసు పుస్తకానికి రూ.5 వేలు ఫిక్స్‌ చేసి మరీ వసూలు చేస్తున్నట్లు సమాచారం. పనుల కోసం కార్యాలయానికి వచ్చే వారిని అధికారులు, సిబ్బంది నెలల తరబడి తిప్పుకుంటున్నట్లు తెలిసింది. సకాలంలో పనులు జరగక విసుగు చెందిన ప్రజలు కార్యాలయంలో ఎంతో కొంత ముట్టజెప్పి పనులు చేయించుకుంటున్నట్లు సమాచారం. అంతటితో ఆగకుండా అక్రమంగా భూముల పట్టాలను అటు ఇటుగా మార్పిడి చేస్తూ ప్రజలను నిలువుదోపిడి చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అక్రమ సంపాదనే ధ్యేయంగా అధికారులు కంకణం కట్టుకున్నట్లు ప్రజలు విమర్శిస్తున్నారు. అక్రమాలకు తోడు భూముల ధరలు ఆకాశాన్నంటడం వారికి కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. కార్యాలయానికి వచ్చే దళారుల ద్వారా సైతం అధికారులు రాయబారం నడుపుతూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. కార్యాలయంలో మరో అధికారి గత కొంత కాలం నుంచి ఇక్కడే తిష్టవేసి అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారినట్లు సమాచారం. ఈ అధికారి ఎక్కడ పని చేసినా ఇదే వ్యవహారం ఉంటున్నట్లు ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమాలకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని పలువురు విమర్శిస్తున్నారు. కొంతమంది అధికారులను ఇక్కడి నుంచి తప్పిస్తేనే కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని అరికట్టవచ్చని మండల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి, అక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
పట్టణ శివారు మండిగిరి పరిధిలో ఆర్ట్స్‌ కళాశాల వెనుక సుమారు 5 ఎకరాల స్థలంలో 1987లో కలెక్టర్‌ ఆదేశాల మేరకు లే అవుట్‌ ప్లాట్లు వేసి రెవెన్యూ శాఖ ఉద్యోగులకు మార్కెట్‌ ధరకు కేటాయించారు. 2019లో నిబంధనలను తుంగలో తొక్కి కేవలం ఆదోని తహశీల్దార్‌ స్థాయిలోనే ఇదే లే అవుట్‌ను ఇష్టానుసారంగా మార్చేశారని విమర్శలు ఉన్నాయి. ఇద్దరు గత రెవెన్యూ శాఖ ఉద్యోగులు చక్రం తిప్పి ఈ ప్లాట్లను బయటి వ్యక్తులకు అమ్మడంలో ప్రధాన పాత్ర పోషించినట్లు వార్తలు వచ్చాయి. అందులో ఒకరు ప్రస్తుతం జిల్లా స్థాయి ఉద్యోగంలో ఉన్నట్లు తెలిసింది. చివరకు ఈ అక్రమ భూ వ్యవహారంపై సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. రెవెన్యూ కాలనీ లే అవుట్‌ అక్రమ మార్పునకు వ్యతిరేకంగా లోకాయుక్తలో ఫిర్యాదు చేయాలని ఆదోని జిల్లా సమితి సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ట్యాక్సీ ప్లేట్‌ స్థానంలో వైట్‌ ప్లేట్‌... తహశీల్దార్‌ నిర్వాకం
ప్రభుత్వ సొమ్మును అడ్డదారుల్లో సొంత పనులకు వాడుకునేందుకు అధికారులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. తహశీల్దార్‌ సొంత కారు వైట్‌ ప్లేట్‌ నెంబర్‌ వాడుతున్నారు. ప్రభుత్వం తహశీల్దార్లకు ప్రయాణ భత్యం కింద ప్రతినెలా రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లిస్తోంది. అందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత వాహనాలను ఉపయోగించరాదు. అదే సమయంలో కేవలం ట్యాక్సీ ప్లేట్‌ (ఎల్లో ప్లేట్‌) వాహనాలను మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం వాహనం కేటాయిస్తే దానికి సంబంధించిన ఖర్చులను భరిస్తుంది. ఎలాంటి నగదు కూడా చెల్లించదు. ప్రభుత్వ వాహనం అందుబాటులో లేకుంటే నిరుద్యోగులు డ్రైవింగ్‌ వృత్తి చేసుకుని ఉపాధి పొందేందుకు ఇలాంటి నిబంధనలు విధించారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ సొంత వాహనాలు వాడుతూ రెంట్‌ వాహనాలను వాడుతున్నట్లు తప్పుడు లెక్కలు చూపుతూ ప్రతినెలా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయమై తహశీల్దార్‌ను వివరణ కోరగా... తన సొంత వాహనమే ఉపయోగిస్తున్నట్లు చెప్పడం గమనార్హం.
అవినీతిని నిర్మూలించాలి
- లింగన్న, సిపిఎం మండల కార్యదర్శి

తహశీల్దార్‌ కార్యాలయంలో ఏ అధికారి సమయానికి రావడం లేదు. కోర్టులో ఉన్న వివాదాల్లో ఇష్టానుసారంగా తలదూర్చడం, ప్రజా సమస్యలను గాలికొదిలేసి సొంత ప్రయోజనాలకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వడం సరి కాదు. తహశీల్దార్‌ కార్యాలయంలో అవినీతి మితిమీరిపోయింది. దీనిని నిర్మూలించేందుకు ఉన్నతాధికారులు దృష్టి సారించాలి.