ప్రజాశక్తి- పాడేరు: నకిలీ ఎస్టీ దృవ పత్రాలు జారీ చేసిన అధికార్లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలనీ ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పల నర్స ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పాడేరు ఐ.టి.డి. ఏ వద్ద ఆదివాసీ గిరిజన సంఘం, గిరిజన సమాఖ్య, ఎస్.ఎఫ్ ఐ ఆధ్యర్వం లో మహా ధర్నా ను ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపధ్యక్షుడు ఎల్.సుందర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన అప్పలనర్శ మాట్లాడుతూ, ఆదివాసీల ప్రయోజనాలు రక్షించ వలసిన రెవెన్యూ అధికార్లు అవినీతి, అక్రమాలకు పాల్పడి ఆదివాసీ సమాజానికి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ తెగల పేర్లతో రెవెన్యూ అధికారులు విచ్చల విడిగా నకిలీ ఎస్టీ కుల దృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నారన్నారు. ఇప్పటికే అరకు, పాడేరు,చింతపల్లి ప్రాంతంలో నకిలీ ఎస్టీ కుల ధవీకరణ పత్రాలు పొందిన వారు ఉద్యోగం, విద్య రంగంలో ఆదివాసీల హక్కులు, రాయితీలు, ప్రోత్సాహకాలు ఆదివాసీల ప్రయోజనాలు పొందుతున్నారని అన్నారు.ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు ఆదివాసి హక్కులకు, చట్టాలకు భంగం కలిగించడమే కాకుండా రాజకీయ నాయకుల అండదండలతో ఏజెన్సీ ప్రాంతంలో పెత్తనం చేస్తున్నారన్నారు. నకిలీ ఎస్టి కుల ధ్రువీకరణ పత్రం పొందినవారు ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా పాల్గొంటున్నారని, వాటితోనే ఆగకుండా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 1/70 చట్టాన్ని దిక్కరించి భూ ఆక్రమణకు పాల్పడుతున్నారన్నారు. కుల ధవీకరణ పత్రాలు మంజూరుకు స్థానిక ఆదివాసీ గ్రామసభ అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొన్నా వాటిని రెవెన్యూ అధికారులు అమలు చేయడం లేదని విమర్శించారు. ఒరిస్సా రాష్ట్రం, మైదాన ప్రాంతం నుండి ఏజెన్సీలో స్థిరపడిన వారికి ఆదివాసి కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయడంలో అధికారులు ప్రలోబాలకు గురి అవుతున్నారని తెలిపారు.నకిలీ ఆదివాసీ కుల దృవీకరణ పత్రాలు పొందిన వారిని ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడానికి ప్రధాన రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. నకిలీ ఎస్టీ కుల ధవీకరణ పత్రం పై అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. పిట్టల రమేష్‌కు నకిలీ ఎస్టీ కుల ధవీకరణ పత్రం జారీ చేసిన అరకు వ్యాలీ తహశీల్దార్‌నే విచారణా అధికారిగా జిల్లా కలెక్టర్ నియమించడం దారుణమన్నారు.గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కూడ రాధాకృష్ణ మాట్లాడుతూ విచారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జె.వి.వి జిల్లా కార్యదర్శి జె. ఆనంద్ రావు, ఎస్.ఎఫ్. ఐ జిల్లా కార్యదర్శి పి చిన్నారావు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులూ టి. కృష్ణారావు, మహిళ సంఘం జిల్లా కార్యదర్శి బిమాలమ్మ, సి.ఐ.టి.యు జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పల కొండపడల్, ఏ.ఐ.టి.యు. సి నాయకులు అమర్, యువజన సంఘం జిల్లా నాయకులూ, విద్యార్థి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










