ఆటో ఆగితే....... కుటుంబం పస్తే
ప్రజాశక్తి - చాగలమర్రి
వారు స్టీరింగ్ పడితేనే వారి కుటుంబం కదులుతుంది...వారు ఆటో స్టార్ట్ చేస్తేనే పిల్లల చదువులు సాగుతాయి.. నిరంతరం రోడ్డుపైన తిరిగితేనే అమ్మానాన్నలకు వైద్యం అందుతుంది... ఆటో రయ్ మని రోడ్డుపై పరిగెడితేనే ప్రయాణికులు గమ్యాన్ని చేరుకోగలరు. అయితే వీరి ఆటో ఒకరోజు ఆగితే వారి కుటుంబం పస్తులు ఉండాల్సిందే. కుటుంబాలను వదిలి ఎండనక ,వాననక ,దుమ్ము, కాలుష్యం లెక్కచేయకుండా రోజంతా కష్టపడేది ఆటో కార్మికులే.
బస్సు సర్వీసు లేని కొన్ని గ్రామాలకు ఆటోలే ప్రధాన ప్రయాణ సాధనం. పట్టణంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ముందుగా గుర్తొచ్చేది ఆటో. ప్రయాణానికి కీలకంగా మారిన ఆటోలు నడిపే వారి జీవనం మాత్రం అంతంత మాత్రమే. రోజంతా కష్టపడినా ఖర్చులు పోనూ రూ200 నుంచి రూ 300 ఆదాయం వస్తుంది. ఈరోజు ఆటో ఆగిన ఆరోజు జీవనం భారమే. వారికి కష్టం ఎక్కువ ఆదాయం తక్కువగా మారింది. ఆటోల సంఖ్య గణనీయంగా పెరిగింది. పోటీ తత్వం ఎక్కువగా ఉంది. చాగలమరి పట్టణంలో మూడు ప్రాంతాలలో ఆటో స్టాండ్ లో ఉంటున్నాయి. ఇక్కడ దాదాపు 200 మంది కార్మికులు ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటో నడుపుతారు. వీరు ప్రయాణికులతో పాటు విద్యార్థులు రోగులు, వృద్ధులకు సేవలు అందిస్తుంటారు. ఇంటర్ డిగ్రీ చదివిన నిరుద్యోగ యువతకు ఆటో డ్రైవింగ్ ఒక ఉపాధిగా మారింది. ఆటో నడపడమే వృత్తిగా భావిస్తున్నారు. తద్వారా వచ్చే సొమ్ముతో తనపై ఆధారపడిన వారిని పోషిస్తూ వారి అవసరాలను తీరుస్తున్నారు.
ఆటో స్టాండ్ లేక అవస్థలు-హుస్సేన్ మియా ఆటో కార్మికుడు.
ఆటో నలిపే డ్రైవర్లకు పలు శాఖల అధికారుల వేధింపులు వారిని అవస్థలు పెడుతున్నాయి. రవాణా అధికారులు చలానాలతో వారిని ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి నిచ్చే ఆటోలను నిలుపుకోవడానికి స్థలం లేక అవస్థలు పడుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ బ్యాడ్జీలు ఆటో డ్రైవింగ్ అర్హతను బట్టి ఇవ్వాలని కోరుతున్నారు. ఆటో డ్రైవర్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని ఆటో వర్కర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కుల మతాలకు అతీతంగా సభ్యుడిపై రుణాలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆటో కార్మికులకు ఉచిత వైద్యం అందించాలని కోరుతున్నారు. యూనిఫామ్ను ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలనేది వారి డిమాండ్. బ్యాడ్జి కలిగి 50 ఏళ్లు దాటిన డ్రైవర్లకు నెల పెన్షన్ ప్రమాద బీమా రు ఐదు లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు.
ఆదాయం లేదు- నాగరాజు ఆటో కార్మికుడు
ప్రస్తుతం నిత్యవసర కుటుంబ ఖర్చులు బాగా పెరిగాయి ఖర్చులు తగ్గట్టు ఆదాయం పెరగడం లేదు. ఆటో కార్మికుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఆటో స్టాండ్ లేక ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు ఆటో స్టాండ్ ఏర్పాటు చేస్తే మేలు.
జీవనం కష్టంగా ఉంది-మళ్ళా అబ్దుల్ గౌస్ ఆటో కార్మికుడు
ఎన్నో ఏళ్లుగా ఆటో కార్మికుడిగా పనిచేస్తున్నాను. ఇబ్బందులు తప్పవు. రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ ధరలతో మరింత భారంగా జీవనం సాగుతోంది. ప్రభుత్వం ఆటోవాలాలకు సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలి.










