Aug 12,2023 21:15

ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ప్రసాద్‌

ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించం
- జిఒ 117ను రద్దు చేయాలి - ప్రాథమిక విద్యారంగాన్ని కాపాడాలి
- ఎంఇఒ-2ల వేతనాలు తక్షణమే విడుదల చేయాలి
- కలెక్టరేట్‌ ఎదుట ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు 12 గంటల నిరసన
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

       ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా, జీతాలు సక్రమంగా ఇవ్వకుండా, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా అధికారులు వ్యవహరిస్తే సహించేది లేదని ఉపాధ్యాయ సంఘాల జెఎసి ఫ్యాప్టో నాయకులు హెచ్చరించారు. ఫ్యాఫ్టో రాష్ట్ర నాయకత్వం పిలుపులో భాగంగా శనివారం అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముందు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున 12 గంటల నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి.ప్రసాద్‌, జె.సుధాకర్‌, ఎస్‌టియు జిల్లా అధ్యక్షులు బేగ్‌ తదితరులు మాట్లాడారు. జీవో 117 ప్రాథమిక విద్యారంగానికి గొడ్డలి పెట్టుగా మారిందని అన్నారు. 9 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయని, 40 వేల ఉపాధ్యాయ పోస్టులు కుదించబడ్డాయని తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందన్నారు. వేలాది మంది నిరుద్యోగ బిఇడి, డిఇడి చేసిన అభ్యర్థులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టా లని, అంతవరకు తాత్కాలికంగా అకాడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ల ను నియమించి ప్రాధమిక పాఠశాల లను కాపాడాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమం లో ప్యాఫ్టో డోన్‌ నాయకులు ఎం.వెంకట సుబ్బారెడ్డి, అల్లిపీరా, సుబ్బా రాయుడు, ప్రసాద్‌, జగన్నాథ్‌ రెడ్డి, చంద్ర మోహన్‌, రాజన్న, మధు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.