బత్తలపల్లి :ప్రతి గర్భిణి ఆసుపత్రిలో ప్రసవం చేసుకొనేలా ఆశా వర్కర్లు అవగాహన కల్పించాలని, ఏ ఆసుపత్రి తల్లీ బిడ్డకు సురక్షితమైందో తెలియజేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణారెడ్డి ఆశా వర్కర్లను ఆదేశించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఆశా డే సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆశా వర్కర్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. గర్భవతులు ఆసుపత్రులలో ప్రసవించేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఆశా వర్కర్ ప్రసవం అనంతరం బాలింతల ఇళ్లకు వెళ్లి తల్లి, బిడ్డకు అందించాల్సిన సేవలను, హెచ్‌ఐవైసి ద్వారా 5 సంవత్సరాల వరకూ పిల్లలకు అందించాల్సిన సేవలను వివరించారు. ఫ్యామిలీ ఫిజీషియన్ ప్రోగ్రాంలో ఆశా వర్కర్ల విధులు, కిల్కారి మొబైల్ అకాడమీ ద్వారా గర్భవతులు, బాలింతలు. చిన్నారుల ఆరోగ్య సలహాల్ని అప్డేట్ చేయడం గురించి, ఆశాలు పనికి పపతగిన పారితోషకం. లక్ష్యాలను చేరుకోకపోవడం వల్ల పారితోషికం ప్రోత్సాహకాన్ని నిలుపుదల చేయడం లాంటివి వివరించారు. గ్రామాలలో ప్రతి శుక్రవారం పర్యటించి ఫ్రై డే నిర్వహణ చేపట్టడం, కీటక జనిత డెంగీ, మలేరియా, తదితర వ్యాధులను అరికట్టాలని సూచించారు. గ్రామ ఆరోగ్య, పారిశుధ్య, పోషకాహార కమిటీలు సమావేశంలో తీసుకునే నిర్ణయాలను ఎంతమేర అమలు చేస్తున్నారో సమీక్షించారు. గ్రామస్థాయిలో ఆశా వర్కర్లులు నిర్వహించే అన్ని రికార్డులు అప్డేట్‌గా వుండాలని ఆదేశించారు. ఆశా వర్కర్ల ఫిర్యాదులను ఆశా ఫెసిలిటేటర్ సకాలంలో పరిఫష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో ధర్మవరం డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ సెల్వియా, జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయ ఇన్‌ఛార్జి మీడియా అధికారి బాబా ఫకద్దీన్, ఏఎస్‌ఓ సూర్యనారాయణ, పిహెచ్‌సి వైద్యాధికారి గంగిరెడ్డి, పర్యవేక్షక సిబ్బంది వేమారెడ్డి, నారమ్మ, గౌరమ్మ, ఎంపిహెచ్‌ఎ, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.










