ఆశీల అక్రమ వసూళ్లను ఆపేయాలి
ప్రజాశక్తి-గన్నవరం
సరుకులు రవాణా చేసేందుకు గన్నవరం వస్తున్న లారీల నుండి ఆశీల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, ఈ వసూళ్లను నిలుపుదల చేయకుంటే ఆశీల పాటదారులపై పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడంతో పాటు హైకోర్టు ఎదుట నిలబెడతామని కృష్ణాజిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తుమ్మల లక్ష్మణస్వామి హెచ్చరించారు. గురువారం గన్నవరంలోని సాయి లక్ష్మీ రోడ్ లైన్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ ఇచ్చిన జీవో 551/2003 ప్రకారం లారీల నుండి ఆశీలు వసూలు చేయకూడదన్నారు. అయినప్పటికీ కొన్ని పంచాయతీల్లో ఆశీల పేరుతో పాటదారులు లారీల యజమానుల నుంచి రోజుకు ఒక్కో దానికి రూ.100 నుంచి రూ.300 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని చెప్పారు. తాము అనేకసార్లు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులు, జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లగా వారు వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పంచాయతీల్లో లారీల నుండి ఆశీలు వసూలు చేయొద్దని చెప్పారని వివరించారు. గన్నవరం పంచాయతీ పరిధిలో ఆశీలు పాడుకున్న వ్యక్తులు వందల రూపాయలు అక్రమంగా లారీ యజమానుల నుండి వసూలు చేయడం సరికాదన్నారు. లారీ యజమానులు అడ్డం తిరిగితే గొడవలకు దిగి కొట్టేందుకు సిద్ధమవుతున్నారని, దీనిపై పోలీస్ స్టేషన్లలో తాము కేసులు పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పారు. ప్రభుత్వం, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల పాటదారులు సొంతంగా రశీదులు ప్రింటింగ్ వేయించుకుని లారీల నుండి సొమ్ము దండుకుంటున్నారని విమర్శించారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి అక్రమాలకు పాల్పడుతున్న పాటదారులను హైకోర్టు ముందు నిలబెడతామని హెచ్చరించారు. అసోసియేషన్ జిల్లా నాయకులు అన్నపురెడ్డి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గన్నవరం ప్రాంతంలో లారీల ఎగుమతులు, దిగుమతుల సమయంలో వందల రూపాయలు ఆశీలు కింద దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారనానరు. అదేమని లారీ డ్రైవర్లు ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతుండటం సరికాదన్నారు. ఇలాంటి చర్యలను లారీ యజమానులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. అక్రమ వసూళ్లకు తాము సహకరించే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని లారీ యజమానులు తీవ్రమైన నష్టాల్లోనూ, కష్టాల్లో ఉన్నారని వివరించారు. టాటా స్టీల్ కంపెనీ వద్ద రోజూ ఎగుమతి, దిగుమతుల కోసం వస్తున్న లారీల యజమానులను ఆశీల పేరుతో దండుకుంటున్నారని మండిపడ్డారు. గురువారం గన్నవరంలో సరుకులు దింపడానికి వచ్చిన ఓ మినీ వ్యాను డ్రైవర్ వద్ద ఆశీలు రూ.100 పాటదారు ఢిల్లీ నాగేశ్వరరావు, అతని మనుషులు వసూలు చేస్తే తాము కల్పించుకుని స్టేషన్లో కేసు పెడతామని హెచ్చరించి తిరిగి డబ్బులు ఇప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అక్రమ వసూళ్ల విషయమై గన్నవరం పోలీస్ స్టేషన్ లో అధికారులకు వినతి పత్రం అందించామని, పంచాయతీ కార్యాలయంలో కూడా అధికారులకు వినతిపత్రం ఇస్తామన్నారు. అనంతరం హైకోర్టు, ప్రభుత్వ ఉత్తర్వుల కాపీలను విడుదల చేశారు. ఈ సమావేశంలో కృష్ణాజిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి వీర వెంకయ్య, కోశాధికారి పాలడుగు నరేష్, గన్నవరం నాయకులు శ్రీహరిరావు, చెరుకూరి వేణు, దేవి శెట్టి సూరిబాబు, వింత రవీంద్రారెడ్డి, సి.ఏ కుమార్ పాల్గొన్నారు.










