Apr 03,2023 21:47

విద్యుత్‌ స్తంభాన్ని నోటీసు బోర్డుగా ఉపయోగించిన అధికారులు

ప్రజాశక్తి - మడకశిర : మడకశిర పట్టణంలో 10వ తరగతి పరీక్షలు అసౌకర్యాల నడుమ ప్రారంభమయ్యాయి. మడకశిర పట్టణంలో 5 పరీక్ష కేంద్రాలు, కదిరేపల్లి సెయింట్‌ ఆన్స్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో రెండు పరీక్ష కేంద్రాలు మొత్తం ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మడకశిర పట్టణంలోని సరస్వతీ విద్యా మందిరం పరీక్ష కేంద్రంలో విద్యార్థులను పరీక్ష రాయడానికి ఏ గదిలో కేటాయించారన్న వివరాలను నోటీసు బోర్డులో ప్రచురణ చేయాల్సుండగా అక్కడ నోటీస్‌ బోర్డ్‌ ఉన్న దానిని ఉపయోగించ లేదు. విద్యార్థులకు ఏ గదికి కేటాయించారన్న సమాచారాన్ని విద్యుత్‌ స్తంభానికి అతికించి చేతులు దులుపుకున్నారు. అదేవిధంగా ఈ పాఠశాలలో కొన్ని గదులలో సరైన సౌకర్యాలు లేవు. మాత ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో కొంతమంది ఇన్విజిలేటర్లు పరీక్ష కేంద్రానికి సెల్‌ఫోన్లు తీసుకెళ్లినట్లు విమర్శలున్నాయి. ఇదేమని అడిగితే తాము చీఫ్‌ సూపరిండెంట్ల వద్ద సెల్‌ఫోన్లను భద్రపరుస్తామని సమాధానమిచ్చారు. మండలంలో పదవ తరగతి తెలుగు పరీక్షను మొత్తం 1275 మంది విద్యార్థులు పరీక్షకు రాయవలసి ఉండగా 1263 మంది హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు సరైన గాలి వెలుతురు లేక ఇబ్బందులకు గురయ్యారు. తెలుగు పరీక్ష అసౌకర్యాల నడుమ ముగిసింది.