అసైన్డ్‌చట్ట సవరణతో పేదలకు తీరని అన్యాయం
భూములు పొంది 20 ఏళ్లు దాటితే యాజమాన్య హక్కు
రెండు జిల్లాల్లో లక్ష ఎకరాలకుపైగా అసైన్డ్ భూములు
సగానికిపైగా అసెన్డ్ భూములు బడాబాబుల చేతుల్లోనే
పేదల చేతుల్లోని కొద్ది భూములూ ఇక పెద్దల పరమే
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
అసైన్డ్ భూములకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో చేసిన చట్టంతో పేదలకు తీరని అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వేలాది ఎకరాల అసైన్డ్ భూములు బడాబాబుల చేతుల్లో ఉండగా ఇక పేదల వద్ద ఉన్న కొద్దిపాటి భూములు సైతం పెద్దల చేతుల్లోకి వెళ్లిపోనున్నాయి. అసైన్డ్‌చట్టంలో చేసిన మార్పులతో పేదల చేతుల్లో భూమి అనేది లేకుండాపోయే ప్రమాదం నెలకొంది. భవిష్యత్తులో పేదలకు భూపంపిణీ అనేది లేకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగానే అసైన్డ్ చట్టం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏలూరు జిల్లాలో 70 వేల ఎకరాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 40 వేల ఎకరాల వరకూ అసైన్డ్‌భూములు ఉన్నట్లు ప్రాథమిక లెక్కలు చెబుతున్నాయి. ఏలూరు జిల్లాలోని చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, ఉంగుటూరు, ద్వారకాతిరుమల, దెందులూరు, పెదవేగి, ఆగిరిపల్లి, ముసునూరు, కలిదిండి వంటి మండలాల్లో పెద్దఎత్తున అసైన్డ్ భూములు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కాళ్ల, భీమవరంతోపాటు పలు మండలాల్లో 40 వేల ఎకరాల వరకూ అసైన్డ్ భూములు ఉన్నాయి. సగానికిపైగా అసైన్డ్ భూములన్నీ బడాబాబుల ఆక్రమణలోనే ఉన్నాయి. పేదలకు పంచిన భూములు సైతం అక్రమ పద్దతిలో బడాబాబులు లాగేసుకుని అనుభవిస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. తమ అమాయకత్వంతో గతంలో తమ భూములను కోల్పోయిన పేదలు ఇప్పుడు తమ భూములు ఇప్పించాలని పోరాటం చేస్తున్నారు. అసైన్డ్ భూములకు సంబంధించి కొనుగోళ్లు, అమ్మకాలు అనేవి నిబంధనల ప్రకారం నిషిద్ధం. చట్టంలో ఉన్న ఈ నిబంధనే పేదలకు ఇప్పటి వరకూ రక్షణ కవచంలా ఉంది. ఇదే తమ భూములపై పేదలు పోరాటం చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. దోసపాడులో దళితులకిచ్చిన వంద ఎకరాలకుపైగా అసైన్డ్ భూమి బడాబాబులు సొంతం చేసుకుని అనుభవిస్తున్నారు. దీనిపై గడిచిన రెండేళ్లుగా పేదలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. టి.నరసాపురం, చింతలపూడి వంటి అనేక మండలాల్లో భూపోరాటాలు కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలంలోని 74 ఎకరాలకు సంబంధించి పోరాటం సాగుతోంది. ఇలా అనేక ప్రాంతాల్లో తమ భూముల కోసం పేదలు రోడ్డెక్కి పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది.
చట్టం మార్పుతో భూములన్నీ పెద్దల చేతుల్లోకే
అసైన్డ్ చట్టాన్ని వైసిపి ప్రభుత్వం మార్పు చేసింది. అసైన్డ్ భూమి పొంది 20 ఏళ్లు దాటిన వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్టం చేసింది. ఇంటిస్థలం అయితే పదేళ్లు దాటితే యాజమాన్యపు హక్కులు పొందుతారని పేర్కొన్నారు. ఇది పేదలకు పెనుశాపంగా మారనుంది. ప్రస్తుతం పెద్దల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములన్నీ చట్టంలో మార్పులతో పెద్దల పరం కానున్నాయి. అమాయక పేదల నుంచి లాక్కుని అనుభవిస్తున్న బడాబాబులకు భూములు హస్తగతమవుతాయి. అక్రమంగా అనుభవిస్తున్న అసైన్డ్ భూములన్నీ బడాబాబులకు సొంతం కానున్నాయి. అంతేకాకుండా భవిష్యత్తులో పేదలకు భూపంపిణీ అనేది ఇక ఉండని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పేదల చేతుల్లో ఉన్న కొద్దిపాటి భూములను బడాబాబులు ఎంతోకొంత చేతిలో పెట్టి దౌర్జన్యంగా సొంతం చేసుకునే పరిస్థితి ఏర్పడనుంది. అసైన్డ్ చట్టం మార్పుతో మళ్లీ భూమి మొత్తం బడాబాబుల చేతుల్లోకి చేరిపోనుంది. పేదలకు సెంటుభూమి లేకుండాపోనుంది. ప్రభుత్వం తెచ్చిన అసైన్డ్‌చట్టంతో పేదలు తీవ్రంగా నష్టపోనుండటంతో తీవ్ర చర్చనీయాంశమైంది.










