ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : పార్వతీపురం నియోజకవర్గంలో వైసిపి టిక్కెట్టు కోసం ఆశావాహులు ఎవరికి వారు లాబీయింగ్ ప్రారంభించారు. నియోజకవర్గంలో ఎంతో బలంగా కనిపిస్తున్న వైసిపి వారికి వారే నాకే టిక్కెట్టు వస్తుందన్న ధీమాతో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అలజంగిజోగారావు, రాష్ట్ర టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, ఎస్సీ కమిషన్ సభ్యులు సవరపు జయమణి టిక్కెట్టు మాకే వస్తుందంటూ ఎవరికి వారే ఉధృతంగా ప్రచారం చేయడంతో ఏసారి టికెట్ ఎవరికనే విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. దీంతో ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్కంఠ రేపుంది. ఈనెల 11న వైసిపి అధినేత, సిఎం జగన్‌మోహన్‌రెడ్డితో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే జోగారావు పత్యేకంగా కలిసిన ఈసారి టికెట్ నీదేనంటూ, నియోజకవర్గంలో ప్రచారం చేసుకో అన్ని తెలియజేశారని స్వయంగా ఆయనే తెలియజేసినప్పటికీ, ఇందంతా అసత్య ప్రచారమని ప్రసన్నకుమార్ గ్రూపీయులు కొట్టిపారేశారు. దీంతో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని వైసిపి కార్యకర్తలో ఇదే చర్చ కొనసాగుతుంది. అలజంగి జోగారావుకు టికెట్ ఖాయం చేస్తే పత్రికాముఖంగా ఎందుకు ప్రకటించలేదనే వారి వాదననూ అలజంగి వర్గంలో ఖండించలేని పరిస్ధితి ఎదుర్కొంటుంది.
నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంలోగానీ, పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలు శతశాతం విజయవంతం చేయడంలో గానీ, కార్యకర్తలను, నాయకులను, ఏకతాటిపై నడిపిం చడంలోనూ, అంగ, ఆర్థికబలంతో స్థానిక ఎన్నికలలో పార్టీని ఎనలేనిరీతిలో విజయతీరాలకు చేర్చిన ఎమ్మెల్యే జోగారావుకు అధిష్టానం వద్ద మంచి గుర్తింపు ఉంది. అయితే ఐపాక్‌తో పాటే జగన్ జరిపిన అంతర్గత సర్వేలో జోగారావుకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని, అందుకే పార్వతీపురం అభ్యర్థిని తప్పక మారుస్తారనే చర్చ జరుగుతోంది. అలాగే రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ చైర్మన్ చేయని కృషి చేయడంలోనూ, పార్టీకి చెందిన అధినాయకులను మెప్పించడంలోనూ జమ్మాన ప్రసన్నకుమార్ కృతకృత్యులయ్యారు కనుక గత ఎన్నికల్లో ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం ఈసారి ఆయనకు తప్పకుండా అవకాశం ఇవ్వడానికి నిర్ణయం జరిగిపోయిందని ఆయన గ్రూపునకు చెందిన కార్యకర్తలు ఖరాఖండీగా చెపుతున్నారు. ఇదిలా ఉండగా అలజంగి, జమ్మానల అభ్యర్థిత్వాలను పక్కనపెట్టి ఈసారి మహిళా అభ్యర్థికి అవకాశం ఇవ్వడం ద్వారా పార్వతీపురం నియోజకం వర్గంలో మళ్లీ వైసిపి జండా ఎగురవేయాలని అధిష్టానం ఆలోచనలో ఉంది కనుక, తన పూర్వపు అనుభవాన్ని, పరిపాలనా దక్షతను దృష్టిలో ఉంచుకుని తనకు టికెట్ ఇస్తారంటూ మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి ఉన్నారు. ఈ మేరకు ఆమె భర్త చాప కింద నీరులా నియోజక వర్గంలో ప్రచా రం చేసుకుంటు న్నారు. పార్వతీ పురం టికెట్ విషయంలో తమ ప్రమేయమేమీ ఉండదని, అంతా జగన్‌మోహన్‌రెడ్డి ఇష్టమని, అభ్యర్థి మార్పు గురించి కూడా తమకేమీ సమాచారంలేదని వైసిపి జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్తు రాజు ప్రకటించడంతో ఉత్కంఠకు ఇప్పట్లో తెరపడే సూచనలు కనబడడంలేదు. ఇప్పటికైన జరగుతున్న ప్రచారాల దృష్ట్యా కార్యకర్తలు, అభిమానుల్లో మరింత సందిగ్ధత తొలగించడానికి జిల్లా మంత్రులు, నాయకులు స్పష్టమైన ప్రకటన చేయాలని నియోజకవర్గ వైసిపి శ్రేణులు కోరుతున్నాయి.










