పుట్టపర్తి రూరల్: రోజురోజుకు పెట్రేగిపోతున్న అసాంఘిక శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ ఎస్‌వి మాధవరెడ్డి సూచించారు. 16వ తేదీ అర్ధరాత్రిన ముదిగుబ్బ రైల్వే గేట్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడ్డ నకిలీ బంగారం, నకిలీ నోట్లను కార్యాలయంలో విలేకరుల ఎదుట ప్రదర్శించారు. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామానికి చెందిన బుక్కే గోవింద నాయక్ ముదిగుబ్బ రైల్వే గేట్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడ్డాడని అతన్ని అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరు పరచి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. నిందితుడి వద్ద నుంచి రూ.21 లక్షల నకిలీ 500 రూపాయల 42 కట్టలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అంతేకాకుండా 185 గ్రాముల నకిలీ బంగారు చైనులు, 102 గ్రాముల బంగారు బిస్కెట్లు, ఒరిజినల్ ఐదు వందల నోట్లు నాలుగు, 50 గ్రాములు ఒరిజినల్ బంగారు బిస్కెట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితునికి గతంలో పలు కేసులు ఉన్నాయని చెప్పారు. కదిరి రూరల్ ప్రొద్దుటూరు తనకల్లు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. ఇలాంటి వారి పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను మభ్య పెట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా వారి ఉచ్చులోకి పడరాదని సూచించారు.










