పుట్టపర్తి రూరల్ : కనీస వేతనాలను అమలు చేయకుండా, ఇతర సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం ఆశా కార్యకర్తలతో వెట్టి చాకిరీ చేయించుకుంటోందని, ఇది దుర్మార్గమైన చర్యని ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి తెలిపారు. ఆశాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం నాడు శ్రీ సత్యసాయి జిల్లా వైద్యాధికారి కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మండుటెండలో ఈ ఆందోళనను నిర్వహించారు. ధర్నాలో జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది ఆశ వర్కర్లు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ధనలక్ష్మి మాట్లాడుతూ ఆశ వర్కర్లు గత 15 సంవత్సరాలు నుంచి వైద్య ఆరోగ్య సేవలు అందించడంలో ఎనలేని కృషి చేస్తున్నారని చెప్పారు. ఇంత పని చేస్తున్నా వీరిని ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.పదివేల వేతనమిచ్చి పదివేల పనులు చేయించుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ సెలవులు, ప్రసూతి సెలవులు ఇవ్వడం లేదన్నారు. ఆదివారాలు సైతం పనులు చేయిస్తున్నారని తెలిపారు. పని ఒత్తిడితో ఆశాలు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై అనారోగ్యాల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి వీరిపై పని భారం తగ్గించి, సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన పనిచేయని సెల్‌ఫోన్లను వెనక్కు తీసుకుని కొత్తఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు .24 గంటలు సచివాలయం ఎఎన్‌ఎంల వెంట తిరగకుండా పనివేళల్లో మాత్రమే వారి వెంట ఉండాలే చూడాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. మే 10వ తేదీలోపు ఆశా వర్కర్ల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు సిద్ధం అవుతామని తెలిపారు. అనంతరం 10 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా వైద్యాశాఖదికారి ఎస్‌వి.కృష్ణారెడ్డికి అందజేశారు. ఈ సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రతి నెలలో నాలుగో మంగళవారం ఆశా వర్కర్ల జిల్లా కమిటీ సభ్యులు, నోడల్ అధికారులతో సంయుక్తం సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చిస్తామన్నారు. ఎఎన్‌ఎంలు చేయాల్సిన ఎన్సీడీ పనులను ఆశాలు చేయకుండా ఎఎన్‌ఎంలకు సహకరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల సచివాలయంలో ఉండకుండా ఫీల్డ్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ పరిధిలోని మిగిలిన సమస్యల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా శ్రామిక మహిళా సంఘం అధ్యక్షురాలు దిల్షాద్, ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సౌభాగ్య, గౌరవాధ్యక్షులు సాంబశివ, జిల్లా అధ్యక్షులు త్రివేణి, కోశాధికారి అనూష, మున్సిపల్ కార్మికుల యూనియన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, సిఐటియు నాయకులు బాబావతో పాటు జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.










