ప్రజాశక్తి మడకశిర రూరల్: ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరిచాలని ఆశా కార్యకర్తల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సౌభాగ్య కోరారు. మడకశిర మండలం గుండమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో బుధవారం ఏపీ ఆశ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్ శాంతికి తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సౌభాగ్య మాట్లాడుతూ వార్డు సచివాలయానికి ఒక్కొక్క ఆశాను మ్యాపింగ్ చేసి ఎన్ హెచ్ ఎం నిబంధనలకు విరుద్ధంగా 3000 నుండి 5000 జనాభాను కేటాయించారని విమర్శించారు. అర్బన్ లో పనిచేస్తున్న ఆశాలను దూరప్రాంతాలకు మ్యాపింగ్ చేయడం వల్ల రోజువారి రవాణ చార్జీలకు నెలకు రెండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని సర్వేల పేరుతో సంవత్సరానికి 30 రికార్డుల వరకు రాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలు పేరుతో నెలలో అనేక సార్లు పిహెచ్‌సిలకు పిలుస్తున్నారని, వచ్చే వేతనంలో సగం ఆరోగ్య సేవలు అందించడానికి ఖర్చు అవుతుందని అన్నారు. ఆశలకు సంబంధంలేని ఏ ఇతర ఆన్‌లైన్ పనులు చేయించరాదన్నారు. ఆశాలసమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఆశా వర్కర్ల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈనెల 17న డిఎంహెచ్‌ఒ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహాలక్ష్మి, జ్ఞానమ్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.










