Sep 12,2023 21:38

సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు నాయకులు ఇందిర

ప్రజాశక్తి - కొమరాడ:    ఆశా, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిర డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆశా, వర్కర్లు కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు ఇందిర, కొల్లి సాంబమూర్తి, ఆశా వర్కర్ల యూనియన్‌ నాయకులు రాజేశ్వరి, కమ్యూనిటీ హెల్త్‌ వర్కింగ్‌ నాయకులు దుర్గ మాట్లాడుతూ మండలంలోని కొమరాడ, మాదలింగి, కూనేరు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఆశా, కమ్యూనిటీ హెల్త్‌వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి పనులు కల్పించాలని, టిఎ, డిఎలు ఇవ్వాలని, కరోనా సమయంంలో మరణించిన ఆశా వర్కర్ల కుటుంబాలకు అన్ని విధాలా భరోసా కల్పించాలని అన్నారు. ప్రత్యేకించి కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు యూనిఫారం, గడిచిన 21 నెలల జీతాలు తక్షణమే ఇవ్వాలని సూచించారు. ఆశా, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు గానూ పని ఒత్తిడి తగ్గించాలని పై సమస్యలు పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఆశా, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు పాల్గొన్నారు.