ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) : ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారం కొరకు ఈ నెల 21న కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి ఎ. కమల పిలుపు నిచ్చారు. సోమవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో కమల మాట్లాడుతూ ఎన్‌హెచ్‌ఎం నిబంధనలకు విరుద్ధంగా 3000 నుండి 5000 జనాభాకు ఆశ వర్కర్లు కి కేటాయించడంతో పని భారం పెరిగిందని ,రకరకాల సర్వే పేరుతో సంవత్సరానికి 30 రికార్డులు రాస్తున్నారు అని, ఈ రికార్డులు కయ్యే ఖర్చు ఆశ వర్కర్లే భరించాల్సి వస్తుందన్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్ క్యారియర్లు, మందులు పి.హెచ్.సి లు నుండి తీసుకురావాల్సిన బాధ్యత ఆశా వర్కర్లదేనని, కొన్నిచోట్ల అధికారులు చెప్తున్నారని ,దీని వలన వచ్చే వేతనంలో సగం రవాణా చార్జీలకే ఖర్చవుతుందన్నారు. కొన్ని సచివాలయాల్లో రోజంతా అధికారులతో పాటు ఉండాలని, అటెండెన్స్ మెయింటెయిన్ చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లు పనిచేయకపోయినా ఎన్ ఎల్ ఈ పి,ఎన్ సి డిబి సి డి యాప్ లు డౌన్ లోడ్ చేసుకుని వర్క్ చేయాలని, లేదంటే వేతనాలు ఆపేస్తామని, అధికారులు బెదిరించటం సరైంది కాదన్నారు. ఆశ వర్కర్లకు కనీస వేతనం 26000/- రూ ఇవ్వాలని, ఆశ వర్కర్ల నియామకాలను విలేజ్ శానిటేషన్ కమిటీలకు అప్పగించరాదని, ప్రభుత్వమే నియామకాలు చేపట్టాలని, ఆశ వర్కుర్ల పోస్టులలో రాజకీయ నాయకుల జోక్యం ఉండరాదని, ఆశ వర్కర్లకు సంబంధం లేని మరి ఏ ఇతరపనులు చేయించి రాదని, అధికారుల వేధింపులు, బెదిరింపులు ఆపాలని, తదితర డిమాండ్ల పరిష్కారం కోసం మార్చి, 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా డి.ఎం.హెచ్.ఓ కార్యాలయం వద్ద ,ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమాల్లో ఆశ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని, జయప్రదం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఆశ వర్కర్స్ యూనియన్, జిల్లా ప్రధాన కార్యదర్శి, పి. ధనశ్రీ, జిల్లా అధ్యక్షురాలు జి.కుమారి, కోశాధికారి వి.కిరణ్మరు, ఉపాధ్యక్షురాలువి. స్వరూప, కె. చందన, యం.సరోజ, బి.రాణిమ్మ,డి. సావిత్రి, జి.కోమలి,బి.చంద్ర, వెంకటలక్ష్మి, సిఐటియు జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి రవి పాల్గొన్నారు.










