అరుదైన వంటలకు రోబోచెఫ్
అమ్మ చేతి వంటను తలపించే వంటకాలు చేసే 'బుచుక్'కు అమర్నాథ్ రూపకల్పన
ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్
కృష్ణాజిల్లా మచిలీపట్టణానికి చెందిన యువ ఇంజనీర్ జె.అమర్నాథ్ ఘుమ ఘమలాడే వంటలు తయారుచేయటంతో సరికొత్త సాంకేతికతకు శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ శాస్త్రవేత్త తయారుచేసిన రోబోచెఫ్ 'బుచుక్' అత్యంత ప్రాచుర్యం పొందింది. అమ్మ చేతి వంటను తలపించే వంటకాలు చేసే అరుదైన ఆవిష్కరణ బుచుక్ రూపకల్పన అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. బందరుకు చెందిన యువకుడు జె అమర్నాథ్ సాంకేతికత సాయంతో వంటకాలు చేసే పరికరం బుచుక్ రోబోచెఫ్ రూపొందించాడు. అంతేకాదు కూచిపూడి నాట్యంలో కూడా శిక్షణ పొంది అనేక ప్రాంతాల్లో అనేక వేదికలపై నాట్యాన్ని ప్రదర్శించాడు. ఇండోర్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు అమ్మ చేతి వంటకు దూరమైన పరిస్థితిలో వంట చేసే పరికరం ఉంటే బాగుండేది అన్న ఆలోచన కల్గిందని, ఆ ఆలోచనకు రూపకల్పన చేయాలని అమర్నాథ్ సంకల్పించాడు. ఇండోర్‌లో ఉద్యోగం వదిలి హైదరాబాదు వచ్చాక రోబో తయారు చేయడాన్ని ప్రారంభించాడు. ఇందుకుగాను బీటెక్ విద్యార్థులు తరుణ్, సుబ్రమణ్యంల సహకారంగా తీసుకున్నాడు. ముగ్గురు కలిసి మూడు సంవత్సరాల పాటు మార్పులు, చేర్పులు చేసుకుంటూ చివరకు ఒక రూపం తెచ్చారు. దానికి బుచుక్ అని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టడం వెనుక చాలా అర్థం ఉందంటాడు అమర్నాథ్. చిన్న పిల్లలను ఆడిస్తున్నప్పుడు ఎంచక్కా బుచుక్ అంటూ ఉంటాం. అదే వంట చేసే పరికరం రోబోకు బుచుక్ అని పేరు పెట్టారు. కాగా ఈ రోబో చెఫ్ 10 రకాల పప్పుకూరలు, పది రకాల ఫ్రై కూరలు, పది రకాల సాంబార్లు, రసంతో పాటు దక్షిణ భారత, దక్షిణ భారతానికి సంబంధించిన పన్నీరు బటర్ మసాలా, కడైవెజ్, మిక్సెడ్ వెజిటబుల్ కర్రీ తయారు చేస్తుంది. ఇటీవల హైదరాబాదులో జరిగిన ఎగ్జిబిషన్లలో పలుమార్లు పరికరం రోబో చెఫ్ బుచుక్ ఉపోయోగించి కొన్ని రకాల కూరలు వండి ప్రదర్శించారు. అయితే ఇంకా మార్కెట్లోకి రావటానికి సంవత్సరం కాలం పడుతుందని అంటున్నారు అమర్నాథ్. దీని పట్ల ఆసక్తి ఉన్నవారు వెబ్సైట్లో bబషష్ట్రబస.ఱఅలో చూడొచ్చునంటున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసైకు రోబో బుచుక్ పనిచేసే విధానాన్ని అమర్నాథ్ వివరించారు. ఆమె రోబో వంట చేసే విధానాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకుని అమర్నాథ్, మిత్రబృందాన్ని ప్రశంసించారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లి వంటన్నల పేరు మారుమూల గ్రామం నుంచి ఢిల్లీ వరకూ తెలుసన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మచిలీపట్నం యువకుడు అమర్నాథ్ కృత్రిమమేథతో తయారుచేసిన రోబోచెఫ్ (బుచుక్) నేడు అదేస్థాయిలో ప్రాచుర్యం పొందుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.










