ప్రజాశక్తి బత్తలపల్లి : ఒంటరి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే సమాజంలో విలువ, గౌరవం లభిస్తుందని మహిళా సాధికారిక సెక్టార్ డైరెక్టర్ విశాల ఫెర్రర్ అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్డీటీ ఫీల్డ్ కార్యాలయంలో ఎటిఎల్ రుక్మాంగద అధ్యక్షతన ఒంటరి మహిళల సాధికారత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ విశాల ఫెర్రర్, ఆర్డీ ప్రమీల కుమారి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళలు సమాజంలో ఉన్న రకరకాల కట్టుబాట్లతో అవమానానికి గురవుతున్నారన్నారు. గతంలో సతీసహగమనం దురాచారాన్ని నిషేధించారన్నారు. ఇప్పుడు అలాంటి మహిళలు ఇతరుల ఇళ్లకు పోకూడదని, పూలు, బొట్టు పెట్టరాదని, శుభకార్యాలకు వెళ్లరాదని వివక్ష చూపుతున్నారని అన్నారు. అయితే ప్రస్తుతం ఇందులో కొంత మార్పు వచ్చిందని, అయితే ఇంకా చాలా మార్పు రావాల్సి ఉందని అన్నారు. ఒంటరి మహిళలను కొంత మంది చాలా ఇబ్బంది పెడుతున్నారన్నారు. ప్రభుత్వం, ఆర్డీటీ అందించే చేయూతతో ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే సమాజంలో అలాంటి మహిళలకు విలువ, గౌరవం ఉంటుందని అన్నారు. అంతకు ముందు వివిధ ఆటల పోటీలను నిర్వహించగా అందులోని విజేతలకు బహునుతులను ప్రదానం చేశారు. ఈసందర్భంగా మహిళలపై పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ సమావేశంలో సిఒలు వెంకటేష్, నాగరాజు, తర్జురాజు, శివాటి లక్ష్మినారాయణ , శోభారాణి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.










