Sep 24,2023 19:40

పటిష్టంగా కార్గో సేవలు
రోజుకు రూ.1.50 లక్షల కార్గో ఆదాయం
దసరాకు ప్రత్యేక సర్వీసులు
జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్‌విఆర్‌.వరప్రసాద్‌
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌

ప్రజలు ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణం చేసి సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని పొందటమే కాక ఆర్‌టిసి అభివృద్ధికి పాటుపడాలని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్‌విఆర్‌.వరప్రసాద్‌ పిలుపునిచ్చారు. జిల్లాలో ఎన్ని డిపోల పరిధిలో ఎన్ని బస్సులున్నాయి? ఏయే రూట్లలో ప్రజలకు సేవలందిస్తున్నాయి? దసరా సెలవుల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా... తదితర ప్రశ్నలకు ప్రజాశక్తి ముఖాముఖీలో ఆయన సమాధానాలిచ్చారు.
ప్రశ్న : జిల్లాలో ఎన్ని ఆర్టీసీ డిపోలున్నాయి? బస్సులెన్ని ఉన్నాయి? ఏయే రూట్లలో ప్రజలకు సేవలందిస్తున్నాయి?
జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోలలో 300 బస్సులున్నాయి. అందులో 213 ఆర్‌టిసి బస్సులు కాగా 87 అద్దె బస్సులున్నాయి. మొత్తం 98 రూట్లలో ప్రజలకు సేవలందిస్తున్నాయి.
ప్రశ్న : జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ఏయే ప్రాంతాలకు ఎన్ని బస్సులున్నాయి?
జిల్లాలో ఏలూరు డిపో నుంచి హైదరాబాద్‌కు తొమ్మిది బస్సులు, నూజివీడు డిపో నుంచి హైదరాబాద్‌కు తొమ్మిది బస్సులు, జంగారెడ్డిగూడెం డిపో నుంచి ఏడు బస్సులున్నాయి. అంతేగాక జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలానికి రెండు బస్సులు, ఏలూరు నుంచి సత్తుపల్లికి ఐదు బస్సులున్నాయి.
ప్రశ్న : జిల్లా నుంచి ప్రముఖ క్షేత్రాలకు గానీ, పర్యాటక ప్రాంతాలకు గానీ ప్రత్యేక సర్వీసులేమైనా ఉన్నాయా?
ప్రతీశనివారం తూర్పుగోదావరి జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయానికి ఏలూరు, జంగారెడ్డిగూడెం డిపోల నుంచి ఐదు బస్సులు తిరుగుతున్నాయి. అలాగే ప్రతీశనివారం ఏలూరు డిపో నుంచి ద్వారకాతిరుమలకు అదనంగా నాలుగు బస్సులు ఏర్పాటు చేశాము. అలాగే ప్రతినెలా పౌర్ణమి రోజు తమిళనాడులోని అరుణాచలం వరకూ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశాము. ఈ బస్సు వెళ్లేటప్పుడు నేరుగా అరుణాచలం వెళ్లి వచ్చేటప్పుడు తిరుపతి సందర్శించి వస్తుంది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.
ప్రశ్న : జిల్లాలో అదనంగా కొత్త రూట్‌లకు బస్సులు కావాలని ప్రజల నుంచి వినతులు ఏమైనా వచ్చాయా?
అలాంటిదేమీ లేదు. కానీ హైదరాబాద్‌, భద్రాచలం, విజయవాడ నాన్‌ స్టాప్‌ కోసం అదనంగా బస్సులు కావాలని ప్రభుత్వాన్ని కోరాము. త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉంది.
ప్రశ్న : జిల్లాలో కార్గో సర్వీస్‌ ఎలా ఉంది? డోర్‌ డెలివరీ కొనసాగిస్తున్నారా?
జిల్లాలో కార్గో సర్వీస్‌ బాగా నడుస్తుంది. దీని ద్వారా రోజుకు లక్షా 50 వేల రూపాయల ఆదాయం వస్తుంది. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోలతోపాటు ఏలూరు పాతబస్టాండ్‌, కొయ్యలగూడెం, కామవరపుకోట, చింతలపూడి, కైకలూరు, ముదినేపల్లి ప్రాంతాల నుంచి కార్గో సర్వీసులు బుక్‌ చేస్తున్నాము. 10 కిలోమీటర్లలోపు ఉన్నవారికి డోర్‌ డెలివరీ చేస్తున్నాము.
ప్రశ్న : ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్‌టిసి ఎలాంటి చర్యలు చేపట్టింది?
ప్రయాణికుల సౌకర్యానికి చాలా ప్రాధాన్యతిస్తున్నాము. అన్ని బస్టాండ్లలో ప్రయాణికుల కోసం కుర్చీలు, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశాము. అంతేకాక ప్రయాణికులు తమ బస్సుల వివరాలు తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు మైక్‌ద్వారా అనౌన్స్‌ చేస్తున్నాము.
ప్రశ్న : వచ్చేనెలలో దసరా పండుగ సందర్భంలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక సర్వీసులు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా?
దసరా సందర్భంగా సెలవుల్లో ఎక్కువగా హైదరాబాద్‌ నుంచి మన జిల్లాకు ప్రయాణికులు వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చేనెల 13, 14, 20, 21, 22 తేదీల్లో హైదరాబాద్‌ నుంచి ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెంకు ప్రతిరోజూ ఆరు ప్రత్యేక బస్సులు అదనంగా నడపడానికి నిర్ణయం తీసుకున్నాము. దీనికి సంబంధించి అడ్వాన్స్‌ బుకింగ్‌ ఇప్పటికే ప్రారంభించాము.
ప్రశ్న : ఆర్‌టిసి ప్రయాణికులకు మీరిచ్చే సలహా?
ఆర్‌టిసిని ఆదరించి బస్సులలో ప్రయాణం చేయడం వల్ల ఆటోలు, కార్లతో పోలిస్తే ప్రజలకు తక్కువ ఛార్జీలతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం కలుగుతుంది. అంతేకాక ఆర్‌టిసి ప్రయాణం సురక్షితం కూడా. ప్రజలు ఆర్‌టిసిలో ప్రయాణించి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నాను.