Jun 08,2023 20:04

నేల వాలిన అరటి పంట

అరటి రైతు అతలాకుతలం
- భారీ గాలివాన బీభత్సం
- 300 ఎకరాల్లో దెబ్బతిన్న తోటలు
- నేలకొరిగిన 8 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, 25 స్తంభాలు.
- కూలిన మట్టి మిద్దె.. తప్పిన ప్రమాదం..


ప్రజాశక్తి - మహానంది

       మహానంది మండలంలో బుధవారం రాత్రి వీచిన భారీ గాలులకు, అకాల వర్షానికి అరటి తోటలు నేలకొరిగాయి. పంటంతా నేలరాలడంతో అరటి రైతు ఆవేదన వర్ణణాతీతం. మహానంది మండలంలో తిమ్మాపురం, బుక్కాపురం, అల్లినగరం, గోపవరం, కృష్ణనంది గ్రామాలలో అరటిపంట నేలవాలి రైతులకు కష్టాలను మిగిల్చింది. చేతికి వచ్చిన పంట కళ్ల ముందు నేల వాలిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. భారీ గాలివాన బీభత్సవం వలన మండలంలో దాదాపు 200 నుంచి 300 ఎకరాల్లో పంట నష్టం కలిగింది. అరటి పంటకు ఒక ఎకరానికి సుమారుగా ఒకటిన్నర లక్ష నుండి రెండు లక్షల రూపాయల మేర పెట్టుబడి పెట్టారు. పంట చేతికి వచ్చే ముందు ప్రకృతి కన్నెరజేయడంతో గాలివానకు కళ్లముందే నేలకొరగడం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈ సందర్భంగా నష్టపోయిన అయ్యన్న అరుగు గ్రామం రైతు రాజు, తిమ్మాపురం గ్రామ రైతు పగడాల నాగరాజు, బుక్కాపురం రమణయ్యలు మాట్లాడుతూ ప్రభుత్వం నుండి అరటి పంటకు ఇన్సూరెన్స్‌ సదుపాయం ఉంటే ఇంత ఆర్థిక నష్టం జరిగేది కాదన్నారు. చేతికి వచ్చిన పంట ఈ సంవత్సరంలో కళ్ళ ముందే మూడు పర్యాయాలు అకాల గాలివానకు దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యాన శాఖ వారు పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి రైతులకు పంట నష్టాన్ని ప్రభుత్వం నుండి ఇచ్చే విధంగా కృషి చేయాలని కోరారు.

పడిపోయిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌
పడిపోయిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌

విద్యుత్‌ శాఖకు భారీ నష్టం : ఎఇ
ఈదురుగాలులతో కూడిన వర్షానికి విద్యుత్‌ శాఖకు సుమారు పది లక్షల రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్లు విద్యుత్‌ శాఖ మండల ఏఈ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. పలుచోట్ల 25 విద్యుత్‌ స్తంభాలు విరిగి పడ్డాయని, 8 ట్రాన్స్‌ఫాÛర్మర్లు పడిపోయాని తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు గ్రామాల్లో, పొలాల్లో తమ సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. పూర్తి స్థాయి సమాచారం అందిన తర్వాత, నివేదికలను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. విద్యుత్‌ అంతరాయం కలగకుండా ఇతర సబ్‌ స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా జరిగేలా చేశామన్నారు.
కూలిన మట్టి మిద్దె.. తప్పిన ప్రమాదం..
మహానంది మండలం గాజులపల్లె గ్రామ పరిధిలోని మజరా గ్రామం బసాపురంలో గత రాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షానికి జ్యోతుల చిన్న రామస్వామి చెందిన మట్టి మిద్దె కూలిపోయింది. ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని బాధితుడు వాపోయాడు. ఇతను పశువులు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. మట్టి మిద్దె కూలడంతో తనకు నిలువ నీడ లేకుండా పోయిందని, ప్రభుత్వమే తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. అలాగే మండలంలోని మహానంది గ్రామంలో బుధవారం సాయంత్రం పిడుగు పడింది. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే మహానంది గ్రామం పార్వతీపురం కాలనీలో పిడుగు పడిన ప్రదేశానికి సమీపంలో చిన్న రేకుల దుకాణం కూలిపోయింది.

 

కూలిన మట్టి మిద్దె
కూలిన మట్టి మిద్దె