ప్రజాశక్తి-పుట్లూరు మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు సూరేపల్లిలో భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసిన అరటి పంట గెలలను గుర్తు తెలియని దుండగులు నరికివేశారు. సిఐ సుబ్రమణ్యం తెలిపిన వివరాల మేరకు.. గొల్లపల్లికి చెందిన రామాంజనేయులు సూరేపల్లికి చెందిన ఇద్దరు రైతుల పొలాన్ని కౌలుకు తీసుకుని అరటి పంటను సాగు చేశాడు. ప్రస్తుతం అరటి పంట గెలలు వేసింది. నెలరోజుల్లోపు గెలలను కోయాల్సి ఉంది. ఈనేపథ్యంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాదాపు 120 అరటి గెలలను నరకడంతోపాటుతో పాటు డ్రిప్పు పైపులను ధ్వంసం చేశారు. శుక్రవారం ఉదయం అరటి పిలకలు కోసేందుకు వెళ్లిన కూలీలు అరటి గెలలు కింద పడడం చూసి రైతు రామాంజనేయులు ఫోన్ ద్వారా తెలిపారు. రామాంజనేయులు తోటకు చేరుకుని బోరున విలపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిఐ సుబ్రమణ్యం, ఎస్‌ఐ దిలీప్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రైతుకు పలువురి పరామర్శ
అరటి గెలలను నరికేసిన మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులును పలువురు నాయకులు పరామర్శించారు. మాజీ మంత్రి సాకే శైలజనాథ్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, ద్విసభ్య కమిటీ సభ్యుడు ఆలం నరసానాయుడు, మండల కన్వీనర్ బాల రంగయ్య, కోమటికుంట్ల కులశేఖర్‌రెడ్డి, మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడు విజరుకుమార్‌రెడ్డి, తదితరులు పరామర్శించారు.
దుండగులు నరికిన అరటిగెలలు










