అనంతపురం కలెక్టరేట్ : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైందని, జగనన్న ఆరోగ్య సురక్ష జిల్లా స్పెషల్ ఆఫీసర్, సివిల్ సప్లయిస్ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ పేర్కొన్నారు. రాప్తాడు మండలం బొమ్మేపర్తి గ్రామంలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో శనివారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కలెక్టర్ ఎం.గౌతమి, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో జగన్న సురక్ష క్యాంపులు జరుగుతున్నాయన్నారు. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 24 వతేదీ వరకు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు జరుగుతాయన్నారు. ప్రభుత్వ వైద్యులు, స్పెషలిస్టులు ఇందులో పాల్గొంటున్నారని, మొత్తం శరీరానికి సంబంధించిన వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఎంహెచ్‌ఒ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని బాగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. కలెక్టర్ ఎం.గౌతమి మాట్లాడుతూ జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద క్యాంపులను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, డిఎంహెచ్‌ఒ డా||ఈబి.దేవి, డిసిఎహెచ్‌ఎస్ పాల్ రవికుమార్, జిల్లా ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ డా||కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, డీఎస్‌ఒ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.










