అర్హులందరికీ ఉద్యోగం ఇవ్వకపోతే ఉద్యమిస్తాం
1998 డిఎస్‌సి పోరాట సాధన కమిటీ హెచ్చరిక
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)
1998 డీఎస్సీలో అర్హత సాధించిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ పోస్టుల సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 98 డీఎస్సీ అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లు పాటించకపోవడం వల్ల ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అర్హత సాధించిన తామంతా ఇప్పటివరకు ఎంతో ఆశగా ఎదురు చూశానని అయితే ప్రభుత్వ నిర్ణయం తమకెంతో ఎంతో నష్టం చేసిందన్నారు. ప్రభుత్వం పునరాలోచన చేసి అర్హత సాధించి సర్టిఫికెట్ల పరిశీలన చేసిన అభ్యర్థులందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ధర్నాకు సంఘీభావం తెలిపిన కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నటరాజ్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ప్రకారం ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్ ప్రక్రియ పక్కాగా అమలు చేయాల్సి ఉన్నప్పటికీ డీఎస్సీ అభ్యర్థుల నియామకాల్లో ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. అభ్యర్థులు ధైర్యంగా తమ పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ,యుటిఎఫ్, సిఐటియు, ఇలాంటి ఎన్నో సంఘాలు వీరి పోరాడడానికి మద్దతునిస్తున్నాయన్నారు. పోరాటం ఉధతం చేసి ప్రభుత్వం ఖచ్చితంగా దిగొస్తుందన్నారు. కె వి పి ఎస్ కష్ణా జిల్లా అధ్యక్షులు సి హెచ్ రాజేష్ మాట్లాడుతూ సామాజిక న్యాయం అంటే నలుగురు ఐదుగురికి మంత్రి పదవి ఇచ్చి కూర్చోబెట్టడం కాదన్నారు. ఉద్యోగ నియామకాల్లో సామాజిక న్యాయం పాటించలేదో చెప్పాలన్నారు. ఈ ధర్నాలో పోరాట కమిటీ నాయకులు ఎం.జీవన్, ప్రకాష్, ఎస్ విజరు కుమార్,బి.శ్రీనివాసరావు, నాన్సీ,రజిని, మేరీ, పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు.










