అర్హులందరికీ సంక్షేమ లబ్ధి
నెల రోజుల పాటు 'జగనన్న సురక్ష' నిర్వహణకు సర్వం సిద్ధం
జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
సంక్షేమ పథకాలకు అర్హులై వుండి ఏ ఒక్కరూ లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదన్న ప్రధాన లక్ష్యంతో, ఏ చిన్న సమస్య వున్నా పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అన్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెలరోజుల పాటు నిర్వహించే 'జగనన్న సురక్ష' పథకం కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ మనజిర్ జిలాని సమూన్‌తో పాటు జెసి నిశాంతి.టి, ఎమ్మెల్సీ ఇసాక్ భాషా, స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ పిపి.నాగిరెడ్డి, మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, డిఆర్‌ఒ పుల్లయ్య, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఒ సుబ్బారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు లాంఛన కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో నెల రోజులపాటు నిర్వహించే క్యాంపులలో అక్కడికక్కడే పథకాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. అలాగే అవసరమైన వారికి సర్టిఫికెట్లు (జనన, మరణ, కుల, సీసీఆర్సీ, రేషన్ కార్డు డివిజన్, హౌస్ హోల్డ్ డివిజన్, ఇన్‌కం మొదలైన 11 రకాల ధ్రువీకరణ పత్రాలు), అవసరమైతే సర్వీస్ ఫీజు లేకుండా అందించనున్నట్లు చెప్పారు. కులమత, వర్గ, పార్టీలకు అతీతంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా నూటికి నూరు శాతం సంతృప్తి స్థాయిలో పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందించాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయంతో, బాధ్యతతో విజయవంతం చేయాలని కోరారు.
జగనన్న సురక్ష పథకం నిర్వహణ ఇలా
వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, జగనన్న మీద ప్రేమ, అభిమానం ఉన్న ఉత్సాహవంతులతో కూడిన టీమ్ ప్రతి ఇంటినీ సందర్శిస్తుంది. అర్హులై ఉండి లబ్ధి అందని వారుంటే గుర్తించి సమస్య పరిష్కారానికి కావాల్సిన పత్రాలు సేకరిస్తారు. కుల, ఆదాయ, జనన మొదలైన సర్టిఫికెట్లు అవసరమైతే వాటికి అవసరమైన పత్రాలను తీసుకుని దరఖాస్తులను దగ్గరుండి పూర్తి చేస్తారు.
సంతృప్తి స్థాయిలో సమస్యలకు పరిష్కారం
ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను సచివాలయానికి తీసుకెళ్లి వాటిని అక్కడ సమర్పించి, టోకెన్ నంబర్, సర్వీస్ రిక్వెస్ట్ నంబరు తీసుకుని వాటిని తిరిగి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తారు. ఈ క్యాంపులు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారో ముందుగానే తెలియజేస్తారు. ఆ రోజు దగ్గరుండి క్యాంపు వద్దకు తీసుకెళ్తారు. సమస్య పరిష్కారమయ్యేలా పర్యవేక్షణ చేస్తారు.
జులై 1 నుండి క్యాంపుల నిర్వహణ
మండల స్థాయి అధికారులైన తహశీల్దార్, ఈఓపీఆర్డీ ఒక టీమ్‌గా, ఎంపీడీఓ, డిప్యూటీ తహశీల్దార్ రెండో టీమ్‌గా ఏర్పడి సచివాలయంలో ఒకరోజు పూర్తిగా గడిపేలా చూస్తారు. జూలై 1 నుంచి ప్రతి సచివాలయంలో క్యాంపు నిర్వహించి అక్కడికక్కడే పథకాల సమస్యలను పరిష్కరించడంతోపాటు సేవా చార్జీలు లేకుండానే అవసరమైన సర్టిఫికెట్లను అందిస్తారు.
1902 హెల్ప్ డెస్క్ ద్వారా సేవలు
వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు ఇళ్లను సందర్శించినప్పుడు ఇంటి యజమాని లేకపోయినప్పటికీ వారికి సమీపంలో క్యాంపు జరిగే రోజు నేరుగా అక్కడకు వెళ్తే '1902' హెల్ప్‌డెస్క్ ద్వారా అవసరమైన సహాయం అందిస్తుంది. ఈ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలంటే టోల్ ఫ్రీ నంబర్ '1902'కి కాల్ చేయాలి. లేదా ష్ట్ర్‌్‌జూర://ఙరషరశీఅశ్రీఱఅవ. aజూ.స్త్రశీఙ.ఱఅ/చ/ష్ట్రశీఎవ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కలెక్టర్ వివరించారు.










