Apr 28,2023 22:16

విలేకరులతో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి - నల్లచెరువు : అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం గృహాలు నిర్మించి ఇవ్వాలని రైతుసంఘం జిల్లా నాయకులు బడాసుబ్బిరెడ్డి డిమాండ్‌ చేశారు, మండల పరిధిలోని వివిధ గ్రామాలలో జగనన్న కాలనీల పేరుతో ఏర్పాటు చేసిన లేఅవుట్లను సిపిఎం నాయకులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు బడా సుబ్బిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలోపాదయాత్ర చేస్తూ అనేకమైన హామీలను ఇచ్చానిని వాటిలో ఒకటి పేద ప్రజలందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారని అన్నారు. ప్రస్తుతం మండల వ్యాప్తంగా కనీసం ఒక్క ఇంటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. మండల వ్యాప్తంగా ఎంతో మంది నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలు, ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో కాపురాలు వెల్లదీస్తున్నారని అన్నారు. పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన జగన్‌ మోహన్‌ రెడ్డిని నమ్మి ఓట్లు వేసినందుకు తగిన శాస్తి జరిగిందని బాధపడుతున్నారని అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో పేద ప్రజలందరినీ కూడగట్టి ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేశామని అన్నారు. ప్రస్తుతం పాలకులు మండల వ్యాప్తంగా అక్కడక్కడ అనువు గాని చోట లేఅవుట్లు ఏర్పాటుచేసి తాము ఏదో సాధించామని గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. అందరికీ ఆమోదయోగ్యమైన మండల కేంద్రం సమీపంలో కే. పూలకుంట రోడ్డు ప్రక్కన 7.13 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని తాము గత సంవత్సరంలో కోరామని అన్నారు. అయితే ఇప్పటివరకు రెవెన్యూ అధికారుల నుండి ఎటువంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు కళ్లు తెరిచి నిజమైన పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పేదలతో కలిసి నిరసన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు శ్రీరాములు, సిఐటియు మండల కార్యదర్శి రామకృష్ణ, భవన నిర్మాణ కార్మిక సంఘం బావయ్య, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.