Aug 24,2023 21:31

లబ్ధిదారులకు చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి - పార్వతీపురం: అర్హులైన లబ్దిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడం జరుగుతుందని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి సిఎం ప్రారంభించిన నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమానికి కలెక్టరు కార్యాలయం నుండి జిల్లా కలెక్టరు, లబ్దిదారులు వర్చువల్‌గా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టరు జిల్లాలో 3915 మంది లబ్దిదారులకు మంజూరు చేసిన రూ.3.99 కోట్లు చెక్కును లబ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ నవరత్నాల పథకాలకు అర్హులై ఉండి, అవసరమైన ధ్రువపత్రాలు పొందలేక, సాంకేతిక కారణాలతో పథకాలు పొందలేకపోయిన, కొత్తగా అర్హత పొందిన లబ్దిదారులకు మళ్లీ దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించి వారికి ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకొకసారి ప్రభుత్వ పథకాలు మంజూరు చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. జిల్లాలో అటువంటి లబ్దిదారులను గుర్తించి, వారికి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జగనన్న సురక్ష వంటి కార్యక్రమాల ద్వారా అందించి 253 మందికి అమ్మఒడి, 1267 మందికి చేదోడు, 30 మందికి ఇ.బి.సి. నేస్తం, 1852 మందికి వసతి దీవెన, 353 మందికి ఆసరా, 113 మంది రైతులకు పధకాలు మంజూరు చేసి ముఖ్యమంత్రి నేరుగా బటన్‌ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లోనికి నిధులు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డ్వామా పీడీ కె.రామచంద్ర రావు, సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎం.డి.గయాజుద్దీన్‌, లబ్దిదారులు పాల్గొన్నారు.