Aug 25,2023 19:59

లబ్ధిపత్రాలను అందజేస్తున్న మంత్రి గుమ్మనూరు

ప్రజాశక్తి - హోళగుంద
అర్హతే ప్రామాణికంగా... ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని లింగంపల్లి గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి గుమ్మనూరు జయరామ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సచివాలయానికి రూ.20 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. కల్వర్టులు, సిసి రోడ్లు, డ్రెయినేజీలు తదితర వాటికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. లింగంపల్లి గ్రామానికి ఇప్పటివరకు రూ.11.25 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు, బూట్లు, నాడు-నేడు కింద పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించడం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే సాధ్యమవుతుందని తెలిపారు. నియోజకవర్గంలో కొత్తగా రాజకీయ భిక్షగాళ్లు తయారయ్యారని, వారిని నమ్మొద్దని కోరారు. కులాభివృద్ధి కోసం ఏనాడూ పాటుపడని వారు ఇప్పుడు రాజకీయం చేయడం తగదన్నారు. నియోజకవర్గంలో అందరికీ సమాన న్యాయం చేశామని తెలిపారు. దేవరగట్టు ఆలయ ఛైర్మన్‌ శ్రీనివాసులు, జడ్‌పి వైస్‌ ఛైర్మన్‌ బావ శేషప్ప, ఎంపిపి తనయుడు ఈసా, సొసైటీ ఛైర్మన్‌ మల్లి, మండల కన్వీనర్‌ షఫీవుల్లా, ఎంపిటిసి రత్నమ్మ, సర్పంచి భర్త విరుపాక్షి రెడ్డి, వైసిపి జిల్లా కార్యదర్శి రామ్‌భీమ్‌ నాయుడు, జిల్లా కమిటీ సభ్యులు అయ్యలప్ప, గ్రామ నాయకులు భీమారెడ్డి, కృష్ణప్ప, సీతారామిరెడ్డి, యువ నాయకులు మౌనిష్‌, శంభులింగ, ఈశ్వర్‌, వైసిపి తాలూకా నాయకులు ప్రకాష్‌ రెడ్డి, రామకృష్ణ, కుమార్‌ స్వామి పాల్గొన్నారు.