Sep 10,2023 20:08

విలేకరులతో మాట్లాడుతున్న కోట్ల

ప్రజాశక్తి - ఆదోని
అక్రమ అరెస్టుతో చంద్రబాబు నాయుడుకు ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరిగిందని టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయ సూర్య ప్రకాష్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని రోషన్‌ గార్డెన్‌లో టిడిపి నాయకులు, మాజీ కౌన్సిలర్‌ రామచంద్ర కుమారుని వివాహ వేడుకలకు హాజరయ్యారు. మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ సూరం భాస్కర్‌ రెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేశారన్నారు. అలాంటి వ్యక్తిని అంతం చేయాలని, రాజ్యాధికారం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి భావించినా అతని తరం కాదని తెలిపారు. అప్పట్లోనే జగన్‌ తాత రాజారెడ్డి, తండ్రి రాజశేఖర్‌ రెడ్డి ఎన్నో ఎత్తులు వేశారని, వాటన్నింటిని చంద్రబాబు చిత్తు చేశారని చెప్పారు. ఇప్పుడు బాబు అనుభవం, నీతి, నిజాయితీ ముందు నియంతలా ఉన్న జగన్‌ ఎంత అని హితవు పలికారు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం దారుణమని దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా జగన్‌ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి భారీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2021లో కేసు నమోదు చేస్తే అసలు ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోయినా అరెస్టు చేశారని, ఇంతకాలం ఏం చేశారని ప్రశ్నించారు. ఈ కేసులో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ఉన్నారని ప్రకటన చేయడం విచారకరమన్నారు. డబ్బులతో ఓట్లు కొనాలని అధికారంలోకి రావాలని జగన్‌ ప్రయత్నిస్తున్నారని, ఇక జగన్‌ ఆటలు సాగవని తెలిపారు. ప్రజలు మేల్కొన్నారని, టిడిపికి అధికారం ఖాయమని స్పష్టం చేశారు. పెద్ద మసీదు కమిటీ ఛైర్మన్‌ సౌదీ రావుఫ్‌, మాజీ కౌన్సిలర్‌ రామచంద్ర, నాయకులు సోమశేఖర్‌ రెడ్డి, షేక్షావలీ, పర్ల నాయకులు గోపాల్‌ రెడ్డి, కన్నె జగదీష్‌, ఎమ్‌డి.బసవరాజు స్వామి ఉన్నారు.