Oct 18,2023 19:51

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రామాంజనేయులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
జిల్లాలోని పశ్చిమ ప్రాంత జీవనాడీ ఆర్‌డిఎస్‌ కుడికాలువకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని, కర్నూలు జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.రామాంజనేయులు, జిల్లా కమిటీ సభ్యులు సి.గోవిందు, నాయకులు హనుమంతు, రాముడు డిమాండ్‌ చేశారు. బుధవారం పట్టణంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 19న ముఖ్యమంత్రి జగన్‌ ఎమ్మిగనూరుకు వస్తున్నారని, ఆయనకు సమస్యలను వివరిస్తామని తెలిపారు. ఆర్‌డిఎస్‌ కుడికాలువ నిర్మాణానికి నిధులు కేటాయించి పనులను చేపట్టాలని కోరారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కర్నూలు జిల్లాను కరువుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మిగనూరు టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేయాలని, పట్టణ ప్రజల తాగునీటి కోసం రెండో ఎస్‌ఎస్‌ ట్యాంకు ఏర్పాటు చేయాలని కోరారు. చేనేత కార్మికులు నేసిన బట్టలు అమ్మేందుకు ఎక్స్‌పోర్ట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని తెలిపారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించాలని, పట్టణంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. పట్టణంలోని లెదర్‌ సొసైటీని పునర్‌ ప్రారంభించి దళితులకు ఉపాధి కల్పించాలని తెలిపారు. పట్టణంలో నిర్మించిన 5 వేల టిడ్కో గృహాలకు మౌలిక వస్తువులు కల్పించాలని, వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం నాయకులు అబ్దుల్లా, సురేష్‌, రాజు, కృష్ణ పాల్గొన్నారు.