Sep 21,2023 09:22

చంద్రబాబుకు మద్దతుగా నిరసన దీక్షల్లో పాల్గొన్న టిడిపి, జనసేన నాయకులు

         అనంతపురం కలెక్టరేట్‌ : రాష్ట్రంలో వైసిపి సాగిస్తున్న అరాచక పరిపాలనకు చరమగీతం పాడుదామని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి పిలుపునిచ్చారు. బాబుకు తోడుగా ఒక నియంతపై పోరాటానికి మేము సైతం అంటూ టిడిపి అనంతపురం అర్భన్‌ నియోజకవర్గం ఆధ్వర్యంలో కమ్మభవన్‌ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 8వ రోజుకు చేరుకున్నాయి. జనసేన నాయకులు వరుణ్‌ నాయకత్వంలో దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి చంద్రబాబును కారాగారంలో పెట్టి రాక్షసానందం పొందుతున్నారని చెప్పారు. రాజకీయాలలో కక్ష సాధింపు వల్ల లాభపడిన వారు చరిత్రలో లేరన్నారు. జగన్‌ ప్రతి చర్యనూ ప్రజలు గమనిస్తున్నారన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో జగన్‌రెడ్డి మీద ఏ విధమైన కేసులూ బనాయించలేదని గుర్తు చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సప్తగిరి సర్కిల్‌ నుంచి ఆర్ట్స్‌ కళాశాల ఎన్టీఆర్‌ విగ్రహం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నామని, పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. బుధవారం నిర్వహించిన దీక్షలో 48, 49, 50 డివిజన్ల కు చెందిన నాయకులతో పాటు బీసీ నేతలు పాల్గొన్నారు. డాక్టర్‌ కొండయ్య నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. వీరి దీక్షలకు జనసేన పార్టీ అనంతపురం నియోజకవర్గం ఇన్‌ఛార్జి టిసి.వరుణ్‌, మహిళా నాయకురాలు పగిడాల శ్రీలత, కుమ్మర నాగేంద్ర, మేదర వెంకటేశులు, హేసేన్‌, అంజి, ఆదినాయక్‌ మద్దతుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిసి.వరుణ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి రాక్షస పాలనను సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సరైన ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం దారుణం అన్నారు. మరో 6 నెలల్లో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని, ఇప్పుడు అకృత్యాలను సాగిస్తున్న వారినెవరినీ వదలబోమని హెచ్చరించారు. టిడిపి రాష్ట్ర నాయకులు ఆదినారాయణ, దేవళ్లమురళి, గాజుల ఆదెన్న, గౌస్‌మొద్దీన్‌, నగర అధ్యక్షుడు మారుతి కుమార్‌ గౌడ్‌, జిల్లా ఉపాధ్యక్షులు డిష్‌ నాగరాజు, జిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణ, నారాయణస్వామి యాదవ్‌, నటేష్‌ చౌదరి, మాజీ కార్పొరేటర్‌ పరిమిరాజారావు, జిల్లా నాయకులు బంగి నాగ, నగర అధ్యక్షురాలు విజయశ్రీ రెడ్డి, సంఘ తేజస్విని, సరళ, జానకి దీక్షలకు మద్దతుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వప్న, టిడిపి రాష్ట్ర కార్యదర్శి బుల్లె శివ బాల, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గాండ్ల విశాలాక్షి, దళవాయి రమాదేవి, టిడిపి జిల్లా బీసీ ప్రధాన కార్యదర్శి పోతుల లక్ష్మీ నరసింహులు, బెస్త షణ్ముఖ, కడియాల కొండన్న, వడ్డే పుల్లన్న పాల్గొన్నారు.