అప్రకటిత కోతలు
- లోడ్ రిలీఫ్ పేరుతో విద్యుత్ నిలిపివేత
- చీకట్లో అల్లాడుతున్న ప్రజలు
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి
జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతలు మొదలయ్యాయి. లోడ్ రిలీఫ్ పేరుతో విద్యుత్ కోత పెడుతుండటంతో ప్రజలు చీకట్లో గడపాల్సి వస్తోంది. ఎడా పెడా విద్యుత్తు కోతలతో గ్రామీణులు అల్లాడుతున్నారు. సాయంత్రం వేళల్లో కోతలు విధిస్తుండటంతో పలు గ్రామాల్లో ప్రజలు సబ్ స్టేషన్లను ముట్టడిస్తున్నారు...
ఉమ్మడి జిల్లాలో అప్రకటిత విద్యుత్తు కోతలు పెరిగిపోయాయి. రాత్రి వేళ కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు నిలిపివేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. డిమాండ్ మేరకు ఉత్పత్తి లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇష్టాను సారం సరఫరా ఆపేస్తున్నారు. అత్యంవసర లోడ్ రిలీఫ్ పేరిట గంటల తరబడి కోతలు విధిస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిద్రలేని రాత్రిళ్లు గడపాల్సి వస్తోందని గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సాధారణంగా 13 నుంచి 14 మిలి యన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరుగుతోంది. 640 మెగా వాట్ల డిమాండ్ ఉంటోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వారం రోజుల క్రితం వరకూ 50 మెగావాట్ల విద్యుత్ లోటు ఉండగా అది ఇప్పుడు 60 మెగావాట్లకు పెరిగింది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఆశించినంత వర్షపాతం నమోదు కాలేదు. గత నెలలో మూడు రోజుల పాటు కురిసిన వర్షాలు మినహా ఉమ్మడి జిల్లాలో ఎక్కడా భారీ వర్షాలు కురవలేదు. ఇదే సమయంలో ఎండల తీవ్రత కూడా అధికంగానే ఉంది. దీంతో ప్రస్తుతం జిల్లాలో విద్యుత్తు వియోగం వేసవిలో ఉన్నట్లే ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి గృహ, వాణిజ్య వినియోగం ఎక్కు వగా ఉంటోంది. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో సాయంత్రం 7.30 నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య 750 మెగావాట్ల డిమాండ్ ఉన్నట్లు విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలోనే సరఫరా లోటు ఏర్పడి గ్రామాల్లో కోతలకు కారణం అవుతోంది. విద్యుత్తు లోటు పెరుగుతుండటంతో నంద్యాల జిల్లాలోని సిమెంటు పరిశ్రమలపై విద్యుత్తు శాఖ ఆంక్షలు పెట్టింది. పాణ్యం, జేఎస్ డబ్ల్యూ తదితర సిమెంటు కర్మాగారాలతో పాటు భారీ పరిశ్రమలు సాయంత్రం 6 గంటల నుంచి విద్యుత్తు వినియోగాన్ని పూర్తిస్థాయిలో తగ్గించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. లోటు ఇలాగే కొనసాగితే ఈ పరిశ్రమలకు సాయంత్రం నుంచి రాత్రి వరకు సరఫరా నిలిపివేసే అవకాశాలనూ అధికారులు పరిశీలిస్తు న్నారు. ఎడా పెడా విద్యుత్తు కోతలతో గ్రామీణులు అల్లాడుతున్నారు. సాయంత్రం వేళల్లో కోతలు విధిస్తుండటంతో పలు గ్రామాల్లో ప్రజలు సబ్ స్టేషన్లను ముట్టడిస్తున్నారు.










