ప్రతి రైతుకూ రూ.2 లక్షలు రుణమాఫీ చేయాలి
కౌలు రైతులకు 'రైతు భరోసా' అందించాలి
ఎపి రైతుసంఘం జిల్లా కమిటీ డిమాండ్
25 నుంచి తహశీల్దార్ కార్యాలయాలు ముందు ధర్నాలకు పిలుపు
ప్రజాశక్తి - ఉంగుటూరు
పంట నష్టాలతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ ఆవేదనవ్యక్తం చేశారు. ప్రతిరైతుకూ రూ.రెండు లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలపై ఈనెల 25, 26, 27 తేదీల్లో అన్ని మండలాల్లో తహశీల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టాలని సమావేశం పిలుపునిచ్చిందన్నారు. గురువారం ఉంగుటూరు మండలం కైకరంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో ఎపి రైతుసంఘం జిల్లా కమిటీ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో వర్షాభావ పరిస్థితి వల్ల పంటల సాగు ఆలస్యమై సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షం కురవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మెట్ట ప్రాంత మండలాల్లో చెరువులు అడుగంటాయని, భూగర్భ జలాలు భారీగా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మరోవైపు అనేక సంవత్సరాలుగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని చెప్పారు. కష్టపడి పంటలు పండించినా మార్కెట్‌లో కనీస ధర రావడం లేదన్నారు. ధాన్యం కొనుగోలులో నిబంధనల పేరుతో జరుగుతున్న మోసాల వల్ల మద్దతు ధర దక్కడం లేదన్నారు. బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు చెల్లించడానికి అధిక వడ్డీలకు ప్రయివేటు అప్పులపై ఆధార పడాల్సి వస్తోందన్నారు. గత తొమ్మిదేళ్లలో మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ కంపెనీలకు రూ.12 లక్షల కోట్లు రుణమాఫీ చేసిందని చెప్పారు. కష్టపడి పంటలు పండిస్తూ దేశానికి ఆహార ధాన్యాలు అందిస్తున్న అన్నదాతలకు మాత్రం ఒక్కపైసా కూడా రుణమాఫీ చేయకపోవడం అన్యాయమని విమర్శించారు. వ్యవసాయ సంక్షోభం నేపథ్యంలో ప్రతిరైతుకూ రూ.2 లక్షలు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా పథకంలో అనేక నిబంధనలు పెట్టి కౌలు రైతులకు మొండి చేయిచూపారని విమర్శించారు. ఓసి సామాజిక తరగతి కౌలు రైతులకు రైతు భరోసా లేదని, ఒక భూ యజమాని కింద ఎంతమంది కౌలు రైతులున్నా ఒక్కరికి మాత్రమే సాయం అందించడంతో అర్హులైన కౌలు రైతులకు అన్యాయం జరిగిందని చెప్పారు. నిబంధనలను సవరించి కౌలు రైతులందరికీ రైతు భరోసా అందించాలని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్‌రావు, కౌలురైతుల సంఘం జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావు మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వివిధ మండలాల నుంచి వచ్చిన రైతు సంఘం నాయకులు గుండపనేని సురేష్, సున్నా వెంకట్రావు, గండి రాజా, కోనా శ్రీనివాసరావు, బోయపాటి సత్యనారాయణ, ఎన్.శశికళ, వెలగలేటి మోహన్‌రావు, టి.మురళీ, కౌలురైతు సంఘం జిల్లా కో కన్వీనర్ వెజ్జు శ్రీరాచంద్రమూర్తి, జిల్లా కమిటీ సభ్యులు ఇందుకూరి వెంకటరామరాజు పాల్గొన్నారు.










