ప్రజాశక్తి-మడకశిర/మడకశిర రూరల్ నియోజకవర్గవ్యాప్తంగా గత టిడిపి హయాంలో చేపట్టి అర్ధాంతరంగా ఆపేసిన పనులను వైసిపి సర్కారు పూర్తి చేయాలని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం టిడిపి హయాంలో చేపట్టి నిలిచిపోయిన పనుల వద్ద సెల్ఫీ దిగి ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడికొండ చెక్‌పోస్ట్ నుంచి సిరా వరకు నేషనల్ హైవే (జాతీయ రహదారి) తెచ్చామన్నారు. అదేవిధంగా మడకశిర పరిధిలో చీపులేటి గ్రామం వద్ద గార్మెంట్ ఫ్యాక్టరీని వందశాతం పూర్తి చేయించామన్నారు. కానీ మీరు వచ్చాక ప్రారంభించలేకపోయారన్నారు. ఈ ఫ్యాక్టరీని ప్రారంభించి ఉంటే నియోజకవర్గవ్యాప్తంగా దాదాపు 3వేల మంది నిరుద్యోగులకు ఉపాధి దొరికేదన్నారు. అదేవిధంగా పట్టణ సుందరీకరణం కోసం అప్పటి టిడిపి ప్రభుత్వం కోట్లు వెచ్చించి డివైడర్ ఏర్పాటు చేసి మధ్యలో బట్టర్‌ప్లై లైట్లు అమర్చామన్నారు. వీటితోపాటు పావగడ రోడ్డు, పెనుకొండ రోడ్డు, పట్టణంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామన్నారు. పట్టణంలో మిగిలిపోయిన హిందూపురం రోడ్డు, మధుగిరి రోడ్డు, అమరాపురం రోడ్డుమార్గంలో ఈ ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలో ఒక్క కరెంటు స్తంభాలు కూడా ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు. అలాగే జూనియర్ కళాశాల క్రీడా ఆవరణలో ఇండోర్ స్టేడియాన్ని దాదాపుగా పూర్తి చేశామన్నారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక చిన్న చిన్న పనులు చేసి పూర్తి చేయలేకపోయిందని దుయ్యబట్టారు. మంజూరైన రింగ్ రోడ్డు పనులను 40శాతం పూర్తికాగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా రద్దు చేసిందన్నారు. అలాగే హంద్రీనీవా ద్వారా సాగు, తాగునీరు తెచ్చామన్నారు. రొళ్ల, అగలి, గుడిబండ, అమరాపురం మండలాల్లో ఉండే హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేయలేకపోయారన్నారు. ఇప్పటికైనా వైసిపి నాయకులు భేసజాలకు పోకుండా అర్ధాంతరంగా ఆపేసిన పనులను పూర్తి చేయాలని ఆయా పనుల వద్ద సెల్ఫీలు దిగి ఛాలెంచ్ విసిరారు. ఆయన వెంట రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌మూర్తి, కన్వీనర్లు మనోహర్, లక్ష్మీనారాయణ, మద్దనకుంటప్ప, తదితరులు పాల్గొన్నారు.
ఆగిన పని వద్ద సెల్ఫీ తీసుకుంటున్న టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి










