ప్రజాశక్తి-ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సిపిఎం నాయకులు సి గోవిందు బి రాముడు రైతు సంఘం నాయకులు అబ్దుల్లా సుభాన్ డిమాండ్ చేశారు. సోమవారం కోరుతూ సిపిఎం, రైతు సంఘాలు స్పందన కార్యక్రమంలో ఎమ్మిగనూరు మండల తాసిల్దార్ ఆంజనేయులుకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం, రైతు సంఘాల నాయకులు పి. గోవిందు, బి. రాముడు, అబ్దుల్లా, సుభాన్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాభావం వల్ల ఎమ్మిగనూరు మండలంలో రైతులు తీవ్రంగా నష్టం పోయారని పేర్కొన్నారు. ఎమ్మిగనూరు మండలంలో ప్రధానంగా ఎల్ఎల్సీ ఆయకట్టు రైతులు సక్రమంగా నీరు అందక పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు పత్తి, మిరప, కంది, ఆముదము మొదలైన పంటలు పూర్తిగా ఎండిపోయాయి. రైతులు పంట సాగుబడి కోసం అప్పులు చేసి ఖర్చు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల పంటలు పెట్టుబడి రాక రైతుల అప్పుల పాలైనారు. ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు, పంట నష్టపరిహారం ప్రతి రైతుకు ఒక ఎకరాకు రు.40,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జనవరి చివరి దాకా ఎల్ఎల్సీ నీటిని పంటల సాగుకు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా రైతులు తీసుకున్న పంట రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కౌలుదారులకు కవులు రద్దుచేసి వారికి కూడా నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరారు. వ్యవసాయానికి 9 గంటల కరెంటు నిరంతరాయంగా అందించాలి. వ్యవసాయంపై కూలీపనిల కోసం ఆధారపడిన వ్యవసాయ కార్మికులకు జీవన భృతిక 20 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు రాజు, భాష, రమేష్ తదితరులు పాల్గొన్నారు.










