Jun 14,2023 22:54

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌

ప్రజాశక్తి-హిందూపురం: పురపాలక సంఘ వ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్మాణం చేసిన అక్రమ కట్టడాలను గుర్తించి, వాటిపై చార్జ్‌ షీట్‌ ఫైల్‌ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ ప్లానింగ్‌ సెక్రటరీలను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ప్లానింగ్‌ సెక్రటరీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయాల వారిగా ఇప్పటి వరకు గుర్తించి అక్రమ నిర్మాణాల గురించి, వాటిపై తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గుర్తించిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోక పోవడంపై అగ్రహం వ్యక్తం చేశారు. పురపాలక సంఘ వ్యాప్తంగా 43 సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ప్లానింగ్‌ సెక్రటరీలు ఆయా వార్డుల వాలంటీర్ల సాయంతో వారి పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించాలన్నారు. వారిపై చార్జ్‌షీట్‌ ఫైల్‌ చేసి కోర్టుకు సమర్పించాలన్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్ల పేరుతో కారణాలు చెబితే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎసిపి ఆనంద్‌ కుమార్‌, ప్లానింగ్‌ సెక్రటరీలు పాల్గొన్నారు.