ప్రజాశక్తి - దేవనకొండ
అనుమానం పెనుభూతమైంది. ఓ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. దేవనకొండకు చెందిన ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో కొడుకును చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటన దేవనకొండ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... దేవనకొండ గ్రామానికి చెందిన రంగులాల్ కుమార్తె అనితను డోన్ మండలం పెద్దపూజర్ల గ్రామానికి చెందిన రాజు (32) అనే వ్యక్తి 10 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు వారి జీవనం సవ్యంగా సాగింది. వీరు వివాహ బంధానికి కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. అనిత కొన్ని సంవత్సరాల నుంచి తల్లి దగ్గర ఉంటూ ఓ ప్రయివేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తూ ఇద్దరు కుమారులను పోషిస్తున్నారు. మృతి చెందిన రెండో కుమారుడు ఉజ్వల్ (3) తనకు పుట్టలేదని, భార్యపై అనుమానంతో రాజు గురువారం భార్య ఇంటి ముందు కత్తితో, వేట కొడవలితో వీరంగం సృష్టించాడు. అత్త, భార్యపై దాడి చేయడానికి ప్రయత్నించగా తప్పించుకున్నారు. బాలుడు ఉజ్వల్‌ను కొట్టి నోటిలో పురుగు మందు వేసి, అనంతరం పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చికిత్స నిమిత్తం గ్రామస్తులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రానికి తరలించేలోపు రాజు మృతి చెందారు. కొన ఊపిరితో ఉన్న కుమారుని కోడుమూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అభం శుభం తెలియని కుమారుని మృతితో తల్లి అనిత రోధిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఎస్‌ఐ భూపాలుడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.










