Sep 15,2023 11:34

శ్రీనగర్‌ :   జమ్ముకాశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో 48 గంటలకు పైగా ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓ జవాన్‌ గల్లంతవగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు గురువారం తెలిపారు. కొకెర్‌నాగ్‌ అడవుల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు సైన్యం, పోలీసులు సంయుక్తంగా బుధవారం తెల్లవారు జామున కూంబింగ్‌ చేపట్టింది. అయితే ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో ఇద్దరు ఆర్మీ, పోలీస్‌ సహా ముగ్గురు అధికారులు మరణించారు. కల్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌, మేజర్‌ ఆశిష్‌ ధోన్‌చక్‌తో పాటు జమ్మూ పోలీస్‌ డిఎస్‌పి హిమాయున్‌ భట్‌ మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. అదే సమయంలో మరో జవాన్‌ మిస్‌ అవ్వడంతో పాటు ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఎంతమంది ఉగ్రవాదులు మరణించారన్న దానిపై సమాచారం లేదు. .

రెండు రోజులుగా పిఒకె -జమ్మూకాశ్మీర్‌ మధ్య ఉన్న పర్వతాల్లో, దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. దట్టమైన అడవులు ఉగ్రవ్షాదులకు రక్షణ ఇస్తున్నాయి. అయితే ఎలాగైనా వీరిని మట్టుపెట్టాలనే ఉద్దేశంతో భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఉగ్రవాదుల మరణించిన ఆచూకీ లభించలేదు. భద్రతా బలగాలు కౌంటర్‌ టెర్రరిజం కోసం కొత్త తరహా ఆయుధాలు, స్ట్రైక్‌ సామర్థ్యం ఉన్న హెరాన్‌ డ్రోన్లను వాడుతున్నారు.