ప్రజాశక్తి-తాడిపత్రిరూరల్ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అనంతపురం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని పెద్దపొలమడ, చిన్నపల్లి గ్రామాల్లో రైతులు సాగు చేసి ఎండిన పత్తి, కొర్ర, ఉద్ది, ఆముదం, కంది, వేరుశెనగ, తదితర పంటలను ఎపి రైతుసంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు రాక పంటలు సాగు చేసిన పంటలు ఎండిపోతుంటే రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. మరోవైపు 9.15 లక్షలు హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 6 లక్షల హెక్టార్లులోపే సాగైందన్నారు. సాగు చేసిన పంట కూడా ఎండిపోతున్నాయన్నారు. కావున ప్రభుత్వం జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి కరువుసహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పంటలు సాగు చేసి నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.50వేలు, సాగు చేయకుండా దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతాంగానికి ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలన్నారు. అలాగే ప్రత్యామ్నాయ పంటలు పెసర, ఉలవలు, సజ్జ, ఆముదం, జొన్న, అనుములు, కొర్రలు, తదితర విత్తనాలను ఉచితంగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం మండల కార్యదర్శి జి.రాజారామిరెడ్డి, నాయకులు యుగంధర్, శిరీషా, రైతులు సూర్యనారాయణయాదవ్, ఆదినారాయణ, లక్ష్మీరెడ్డి, శేఖర్, మల్లికార్జున, శివరామయ్య తదితరులు పాల్గొన్నారు.
వర్షాభావంతో ఎండు దశకు చేరుకున్న పంటను పరిశీలిస్తున్న ఎపి రైతుసంఘం నాయకులు










