ప్రజాశక్తి - చిప్పగిరి
అనాథ పిల్లలను ఆదుకోవడం కన్నా మించిన సహాయం ఇంకేది లేదని ఆలూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణ తెలిపారు. శుక్రవారం చిప్పగిరిలోని ఫాతిమా ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఇన్వెస్టిట్యూర్ సరమూనీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో 16 మంది అనాథ విద్యార్థులు చదువుతున్నారని తెలిసి ముందుగా పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అనాథ బాలలను అక్కున చేర్చుకొని చలించి పోయారు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని ఆ చిన్నారులకు ఆశ్రయం కల్పించి విద్యాబుద్ధులు అందిస్తున్న పాఠశాల యాజమాన్యం ఆదరణను చూసి ప్రశంసించారు. అనాథ పిల్లల బాగోగుల కోసం అక్కడికక్కడే తక్షణ సహాయం కింద రూ.50 వేల చెక్కును పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. ఈ 16 మంది అనాథ పిల్లల బాగోగుల కోసం ఇక నుంచి ప్రతేడాది తన వంతు సహాయంగా రూ.50 వేలు అందజేస్తానని హామీఇచ్చారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినికి రూ.10 వేలు సహాయంగా అందించారు. ఈ నగదును కూడా ప్రతేడాది కొనసాగిస్తానన్నారు. ప్రధానోపాధ్యాయులు అజిత, వైసిపి కన్వీనర్ రంగస్వామి, కోకన్వీనర్ హనుమన్న, మాజీ సర్పంచి కొండా శేఖర్, అసెంబ్లీ బూత్ కన్వీనర్ రాజన్న, శ్రీధర్, సతీష్, ఆనంద్ పాల్గొన్నారు.
అనాథ బాలలకు రూ. 50 వేల చెక్కును అందజేస్తున్న గుమ్మనూరు నారాయణ










