ప్రజాశక్తి - హాలహర్వి
మండలంలోని బాపురం గ్రామంలో అనాథలుగా మిగిలిన ఇద్దరు పిల్లలకు నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామానికి చెందిన మంజునాథ్, శారదమ్మలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంజునాథ్ పదేళ్ల క్రితం మృతి చెందారు. శారదమ్మ అప్పటి నుంచి కూలీ పని చేసుకుంటూ పిల్లలు గణేష్, పూజలను చదివించేవారు. ఆమె కూడా 10 రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందడంతో పిల్లలు అనాథలుగా మిగిలారు. విషయం తెలుసుకున్న వైసిపి రాష్ట్ర నాయకులు, కర్నూలు జిల్లా జెసిఎస్ కోఆర్డినేటర్ తెర్నేకల్ సురేంద్రరెడ్డి మంగళవారం రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. పూజకు కస్తూరిబా గాంధీ రెసిడెన్సియల్ పాఠశాలలో ఇంటర్మీడియట్ వరకు, గణేష్‌కు ప్రయివేట్ ఫౌండేషన్ ద్వారా చదువుకోవడానికి ఏర్పాటు చేశారు. గణేష్, పూజ పెద్ద నాన్న, గ్రామస్తులు వారం తర్వాత పంపిస్తామని తెలిపారు. సురేంద్రరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శేషాద్రి రెడ్డి, వాల్మీకి రాఘవేంద్ర, కురువ వీరన్న, పులి నరేష్, రామానాయుడు, పద్మనాభం, అశోక్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఆర్థిక సాయం అందజేస్తున్న నాయకులు










