Oct 18,2023 22:32

అంతర్జాతీయ స్థాయిలో 'శ్రీజ'కు గుర్తింపు

అంతర్జాతీయ స్థాయిలో 'శ్రీజ'కు గుర్తింపు
చికాగోలో అవార్డు అందుకున్న సీఈఓ జయతీర్థచారి
మరింత ఉత్సాహంతో పనిచేస్తాం: ఛైర్‌పర్సన్‌ శ్రీదేవి
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)
మహిళా సాధికారతే లక్ష్యంగా వడివడిగా ఎంతో కార్యచరణతో ప్రారంభించిన శ్రీజ దశాబ్ద కాలంలోనే అంతర్జాతీయ వేదికపై నిలిచి భారతదేశ గౌరవాన్ని, మహిళల అభివద్ధికి బాటలు వేస్తున్న సంస్థగా ఖ్యాతి గడించింది. డెయిరీ రంగంలో మహిళా పాడి రైతులను సంస్థ నిర్వహణలోనూ భాగం చేస్తూ వినూత్న రీతిలో మహిళా సాధికారత సాధించింది. శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మొదలైన శ్రీజ ప్రస్థానం నేడు అంతర్జాతీయ వేదికపై నిలిచి శ్రీజా కార్యచరణను ప్రపంచ దేశాలు అవలంబించేలా చేసింది. అమెరికాలోని చికాగో వేదికగా నిర్వహించిన ఇంటర్నేషనల్‌ డెయిరీ ఫెడరేషన్‌ కార్యక్రమంలో ప్రపంచంలో ఉమెన్‌ ఇన్‌ డెయిరీ అనే అంశంలో దాదాపు 173 దేశాలు పోటీ పడ్డాయి. శ్రీజ సంస్థ అవలంబిస్తున్న అత్యధిక టెక్నాలజీ, ఆన్లైన్‌ చెల్లింపులు, మహిళా సాధికారత కోసం నూతన కార్యచరణతో కూడిన కార్యక్రమాల నిర్వహణ వీటి ముందు ఏ దేశానికి చెందిన కంపెనీలు నిలువు లేక పోయాయి అనడంలో అతిశయోక్తి లేదు. శ్రీజ సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఇన్నోవేషన్‌ విభాగంలో ఈ అవార్డును జయతీర్థచారి అందుకొని అంతర్జాతీయ వేదికపై శ్రీజ ప్రస్థానాన్ని హాజరైన డెలిగేట్స్‌ కు వివరించారు. పాడిరంగంలో మహిళల పాత్రను ప్రతి ఒక్కరూ గర్వించే స్థాయికి తీసుకురావడానికి ఎంతో కషి చేశామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సభ్యుల సంఖ్య కలిగిన శ్రీజ సంస్థకు మహిళల నాయకత్వాన్ని పెంపొందించడానికి, పాడి పరిశ్రమలో వారి సాధికారతకు బాటలు వేయడానికి ఉద్దేశించిన అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. లక్షా 20 వేల మంది మహిళా పాడి రైతులు తరపున ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం శ్రీజ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడులోని 11 జిల్లాల్లో సగటున 6.5 ఎల్‌ఎల్‌ఎపిడి పాల సేకరణ చేస్తోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 71,200 కోట్ల టర్నోవర్‌ ను సాధించగలదని ఆశిస్తున్నట్లు చెప్పారు. శ్రీజ 2.0 లక్షల మంది మహిళల సభ్యత్వ నమోదు, 10.0 లక్షల లీటర్ల పాల సేకరణలను రాబోయే మూడు సంవత్సరాలకు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (ఏహెచ్డి) అల్కా ఉపాధ్యాయ పాల్గొని మాట్లాడుతూ శ్రీజ సంస్థకు ఇంతటి గొప్ప అవార్డు రావడం సంతోషంగా ఉందని, ఏ డెయిరి సంస్థకైనా ఇదే అతిపెద్ద అవార్డు అని అన్నారు.
శ్రీజ చైర్‌ పర్సన్‌ శ్రీదేవి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో శ్రీజ సంస్థకు గుర్తింపు రావడం అభినందనీయమని, ఈ అవార్డుతో మరింత ఉత్సాహంతో పని చేస్తూ మహిళా సాధికారతకు, పాడి పరిశ్రమ అభివద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. అవార్డు ఎంపికలో మూడు కంపెనీల మధ్య పోటీ కొనసాగిందని మూడు కంపెనీలలో రాజస్థాన్లోని ఉదయపూర్‌ కు చెందిన ఆశా మహిళా మిల్క్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌, గుజరాత్‌ మిల్క్‌ అండ్‌ మార్కెటింగ్‌ కో-ఆపరేటివ్‌ ఫెడరేషన్లను దాటి శ్రీజ ఈ అవార్డును సొంతం చేసుకుందన్నారు. శ్రీజ సంస్థకు ఇంతటి గుర్తింపు రావడం పట్ల కంపెనీ వర్గాలు, ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తపరిచారు.