Jul 27,2023 20:14

పెద్దహరివాణం పిహెచ్‌సి సెంటర్‌

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
మండలంలోని ఆయా గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు జ్వరాలతో మంచం పడుతున్నారు. మరికొంతమంది పిహెచ్‌సిలకు పరుగులు తీస్తున్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మండలంలోని పెద్దతుంబలం, పెద్దహరివాణం, మండిగిరి, చిన్నహరివాణం, సంతేకుడ్లూరు, మదిరె, ఆరెకల్లు, ఇస్వి, హనవాలు, జాలమంచి, పాండవగల్‌, కుప్పగల్‌, నాగలాపురం, కపటి తదితర గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే గ్రామంలో అనేకమంది వృద్ధులు, చిన్నపిల్లలు మంచం పట్టారు. మరికొందరు కొద్దిరోజులుగా పెద్దహరివాణం, పెద్దతుంబలం పిహెచ్‌సికి క్యూ కడుతున్నారు. ఇటీవల ఆ గ్రామం నుంచి 20 మందికి పైగా గ్రామస్తులు విష జ్వరాలతో పిహెచ్‌సికి చేరుకున్నారు. దోమల నివారణకు గాను స్ప్రేయింగ్‌, ఫాగింగ్‌ చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రతిఒక్కరూ దోమ తెరలు వినియోగించాలని, వేడి నీరు తాగాలని పెద్దహరివాణం పిహెచ్‌సి వైద్యులు అమ్రాన్‌ సూచించారు.
కలుషిత నీరే కారణమా..?
గ్రామాల్లో విష జ్వరాల వ్యాప్తికి కలుషిత నీరే కారణమని తెలిసింది. ప్రస్తుతం జోరుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు ఆ నీటిని తాగి జ్వరాల బారిన పడుతున్నారనే వాదనలు లేకపోలేదు. మరోవైపు ఆ ప్రాంతంలో పారిశుధ్యం నిర్వహణ కూడా అంతంతమాత్రంగానే ఉంది. జ్వర బాధితులు పెరుగుతున్నారు. పెద్దహరివాణం, పెద్దతుంబలం పిహెచ్‌సికి చేరుకోవడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. గ్రామంతో పాటు పిహెచ్‌సిలో ఇప్పటివరకు ఆ గ్రామానికి చెందిన 117 మందికి రక్త పరీక్షలు చేశారు. వారిలో 24 మందికి విష జ్వరాలు ఉన్నట్లు గుర్తించారు. జ్వరపీడితులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి జ్వరాల అదుపునకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.