ప్రజాశక్తి - పార్వతీపురం : గిరిజన సంక్షేమానికి అంకితభావంతో పనిచేసి, వారి జీవితాలలో వెలుగులు నింపాలని జాతీయ షెడ్యూలు తెగల కులాలు కమిషన్ సభ్యులు అనంత నాయక్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గుమ్మలక్ష్మి పురం ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల, నీలకంఠా పురం గిరిజన సంక్షేమ బాలికోన్నత పాఠశాలలను గురువారం సందర్శించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అనంత నాయక్ మాట్లాడు తూ డా.బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగంలో గిరిజనుల అభి వృద్ధికి పలు అధికరణలు చేర్చారన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు కృషి చేయాలన్నారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు విస్తతం చేసేందుకు ఆరు బ్యాంకు శాఖలు ప్రతిపాదించామని చెప్పారు. అశావాహక జిల్లాల కేటగిరీలో జిల్లా ఉత్తమ ఫలితా లను సాధిóస్తుందని వివరించారు. గిరిజన యువతకు నైపుణ్య అభివృద్ధి కల్పించి యువత మంచి ఉపాధి పొందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులు వివరించారు. జిల్లాలో గిరిజనులను ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు యుఎస్‌ఒఎఫ్ కార్యక్రమం కింద 190 మొబైల్ టవర్ల నిర్మాణాలకు మంజూరు అయ్యా యని చెప్పారు. అవసరమైన చోట్ల స్థలాలు మంజూరుకు, రహదారుల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం జిల్లా కేంద్రంలో, బుధ, శుక్ర వారాల్లో మండలాల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 27142 ఇళ్లులు మంజూరు కాగా, 11880 నిర్మాణం పూర్తి అయ్యాయని ఆయన చెప్పారు. జిల్లాలో 168 గ్రామ సచివాలయాలు, 111 రైతు భరోసా కేంద్రాలు, 180 వెల్ నెస్ కేంద్రాలు పూర్తి చేసామని చెప్పారు. వైద్య సేవల్లో భాగంగా పిఎంజెఎవై హెల్త్ కార్డుల ఇకేవైసిని 97.34 శాతం సాధించామని చెప్పారు. శిశు మరణాలు నియంత్రణకు ఇమ్మ్యునైజేషన్ కార్యక్రమం పక్కాగా చేపడుతున్నామనిపేర్కొన్నారు. ఆర్‌ఒఎఫ్‌ఆర్ చట్టం కింద 1.79 లక్షల ఎకరాలకు సంబంధించి 67506 పట్టాలను గిరిజనులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. సీతంపేట ప్రాంతంలో పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. రూ.2.67 కోట్లతో 9పనులు మంజూరు చేశామని చెప్పారు. విద్యుత్ సదుపాయం లేని గిరిజన గ్రామాలకు సౌర, విద్యుత్ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఐటిడిఎ పిఒ సి.విష్ణు చరణ్, డిఆర్‌ఒ జె.వెంకట రావు, కమీషన్ సభ్యులు - సంచాలకులు జయంత్ జె సరోడే, స్పెషల్ రిపోర్టర్ రాధాకకాంత త్రిపాఠి, రీసెర్చ్ ఆఫీసర్ ఆర్.ఎస్. మిశ్రా, ప్రైవేట్ సెక్రెటరీ పి.కె.పరిడా, ట్రైబల్ రీసెర్చ్ మిషన్ ఇడి జి.చినబాబు, డాక్టర్ చుక్కా నాగరాజు, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కె శ్రీనివాస రావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.










