Jul 10,2023 22:29

కలెక్టరేట్‌ వద్ద బైటాయించి నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు

      ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్‌ : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై అంగన్‌వాడీలు నిరసనాగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల మొద్దునిద్రను తొలగించేందుకు పోరుబాట పట్టారు. 36 గంటల నిరసన దీక్ష పేరుతో చేపట్టిన ఆందోళన కార్యక్రమం సోమవారం నాడు పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం వద్ద ప్రారంభం అయ్యింది. ముందుగా అంగన్‌వాడీ వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అమలు పరచాలని ర్యాలీలో నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద బైటాయించి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తల వద్దకు ఆర్డీవో భాగ్యరేఖ కలెక్టర్‌ తరుపున అక్కడికి చేరుకుని వారి డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. ఐసిడిఎస్‌ పీడీ రావాలని అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. దీంతో అక్కడికి ఐసిడిఎస్‌ పీడీ లక్ష్మీకుమారి వచ్చారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై పీడీతో అంగన్వాడీల యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, అధ్యక్షురాలు మాబున్నీసా, శ్రామికమహిళా సంఘం కన్వీనర్‌ దిల్షాద్‌, రాష్ట్ర సిఐటియు ఉపాధ్యక్షులు జి.ఓబులు మాట్లాడారు. ప్రతినిధుల బందం కలెక్టర్‌ అరుణ్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం అక్కడి నుంచి ఆర్డీవో కార్యాలయం వద్దకు ర్యాలీగా చేరుకుని అక్కడ 36 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర నాయకులు జి.ఓబులు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు వేతనాలను పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపుతానని 2017 దీపావళి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదన్నారు. వెలుగులు నింపడం మాట అటుంచి వారి జీవితాల్లో చీకట్లు నింపేలా మోడీ చర్యలు ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాల ఫలితంగా అంగన్‌న్వాడీలు అనేక సమస్యలను పరిష్కరించుకున్నారని చెప్పారు. ఆ స్ఫూర్తితోనే ప్రస్తుత సమస్యల పరిష్కారానికి మరింత ఐక్యతతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అంగన్‌వాడీలపై రాజకీయ పెత్తనం, వేధింపులను ఆపాలన్నారు. 2022 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు సూచించిన 1972 గ్రాజిటీ చట్టాన్ని అంగన్వాడీ వర్కర్లకు వర్తింపు చేయాలన్నారు. పది కోట్ల మంది పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్న ఐసిడిఎస్‌ ప్రాజెక్టును ఇంకా బలోపేతం చేసి వారికి ఆర్థిక వనరులు కల్పించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీలకు మరింత బడ్జెట్‌ పెంచాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌.వెంకటేష్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన కోర్కెలు తీర్చేందుకు ప్రభుత్వాలు ఎందుకు వెనుకంజ వేస్తున్నాయో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని చెప్పారు. జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన నాలుగేళ్లు పూర్తయినా అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం విచాకరం అన్నారు. యాప్‌ల పేరుతో అంగన్‌వాడీలపై వేధింపులను ఆపాలన్నారు. కేంద్రాల్లో తనిఖీల పేరుతో ఉన్నతాధికారుల వేధింపులనుఊ నియంత్రించాలన్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎం.ఇంతియాజ్‌, జిఎల్‌.నరసింహులు, సాంబశివ గంగాధర్‌, శ్రామిక మహిళా కన్వీనర్‌ దిల్షాద్‌, రైతుసంఘం నాయకులు బడా సుబ్బిరెడ్డి, ఆటో యూనియన్‌ బాబావలి, పెద్దన్న, అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి శ్రీదేవి, అధ్యక్షురాలు మాబున్నీషా, కోశాధికారి శ్రీదేవి, కదిరి రంగమ్మ, మడకశిర ఉష, ధర్మవరం చంద్రకళ, హిందూపురం శోభతో పాటు జిల్లా నలమూలల నుంచి వేలాదిగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.