పుట్టపర్తి రూరల్ : సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీలు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దడపుట్టించేలా ఈ నిరసన కార్యక్రమం సాగింది. వేలాది మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, మినీ కార్యకర్తలు పిడికిలి బిగించి ఈ పోరాటంలో పాలుపంచుకున్నారు. రెండురోజుల పాటు నిర్వహించిన ఈ నిరసనలో సిఐటియు, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ వద్ద ప్రారంభం అయిన నిరసన దీక్ష మంగళవారం సాయంత్రం వరకు కొనసాగింది. సోమవారం రాత్రి కూడా అంగన్‌వాడీలు దీక్షా శిబిరంలోనే నిద్రించారు. పిల్లలతో సహా అక్కడే నిద్రించి వారి నిరసనను తెలియజేశారు.
జిల్లా అంగన్వాడి యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నాడు ప్రారంభం అయిన 36 గంటల నిరసన దీక్ష మంగళవారం సాయంత్రం ముగిసింది. సిఐటియు ఆధ్వర్యంలో పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం వద్ద రెండవ రోజూ నిరసనను కొనసాగించారు. జిల్లా నలమూలల నుంచి పెద్ద సంఖ్యలో అంగన్‌వాడీ కార్యకర్తలు, మినీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నూర్ మహమ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్.వెంకటేష్, శ్రామిక మహిళా కన్వీనర్ దిల్షాద్, జిల్లా నాయకులు ఎం.ఇంతియాజ్, జిఎల్ నరసింహులు, రైతు సంఘం నాయకులు బడా సుబ్బిరెడ్డి, రామకష్ణ, సాంబశివ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఫిరంగి ప్రవీణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నూర్ మహమ్మద్ మాట్లాడుతూ ఐసిడిఎస్ వ్యవస్థను అంతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన విద్యావిధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ప్రైవేటు పరం చేయడానికి కుట్ర చేస్తోందన్నారు. దీనికి అడ్డుచెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారికి వంతపాడడం దుర్మార్గంగా ఉందన్నారు. అర్థంలేని యాపులతో అంగన్వాడీలను వేధిస్తున్నారన్నారు. తెలంగాణ కన్నా వెయ్యి రూపాయల అదనంగా జీతం ఇస్తానని ఇచ్చిన హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతున్నా దానిని నిలబెట్టుకోలేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. రైతుసంఘం జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి మాట్లాడుతూ యాపుల పేరుతో అంగన్వాడీలను వేధించే చర్యలను ప్రభుత్వం మానుకోవాలన్నారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి అధికారంలోకి రాకమునకు ఒక మాట, ఇప్పుడు మరో మాట మాట్లాడడం సరికాదన్నారు. ఇలాంటి ప్రభుత్వాల మొద్దునిద్రను తొలగించిచేందుకు అంగన్‌వాడీలు మరింత ఐక్యపోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీదేవి, అధ్యక్షురాలు మాబునీషా, కోశాధికారి శ్రీదేవి, కదిరి రంగమ్మ, మడకశిర ఉష, ధర్మవరం చంద్రకళ, హిందూపురం శోభతోపాటు జిల్లా నలుమూల నుంచి వచ్చిన వేలాదిమంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.










