Sep 13,2023 21:44

రిటైర్డ్‌ ఉద్యోగుల పరిస్థితి దారుణం
అందని బెనిఫిట్లు, వృద్ధాప్య పింఛను
ఇంటి అద్దెలు, కరెంటు బిల్లుల కోసం ఎదురుచూపులే
వేరే ప్రాజెక్టులో విలీనమైన కేంద్రాల పరిస్థితి అగమ్యగోచరం


ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి :  అంగన్‌వాడీల సమస్యలు పాలకులకుగానీ, అధికారులకుగానీ పట్టడం లేదు. దీంతో అంగన్‌వాడీల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. రెండు జిల్లాలో 3,911 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, 7,352 మంది వర్కర్లు, ఆయాలు పనిచేస్తున్నారు. అన్ని పనులకు అంగన్‌వాడీ ఉద్యోగులను ఉపయోగించుకుంటున్న ప్రభుత్వం, వారి సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఉద్యోగ విరమణ పొందిన అంగన్‌వాడీ ఉద్యోగులకు బెనిఫిట్‌ కింద వర్కర్లకు రూ.50 వేలు, ఆయాలకు రూ.20 వేలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఉద్యోగ విరమణ చేసిన అంగన్‌వాడీలకు ఈ సొమ్ములు సకాలంలో ఇవ్వడం లేదు. ఏలూరు జిల్లాలోనే ఈ విధంగా బెనిఫిట్స్‌ సొమ్ము అందాల్సిన ఉద్యోగులు వందమందికిపైగా ఉన్నట్లు చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈవిధమైన సమస్యతో ఉద్యోగులు సతమతమవుతున్నారు. అంతేకాకుండా అంగన్‌వాడీలు స్కీమ్‌ వర్కర్ల పరిధిలోకి వస్తారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులగా పేర్కొంటూ ప్రభుత్వ పథకాలను నిలిపివేసింది. దీంతో రూ.11 వేలు మాత్రమే జీతం తీసుకుంటున్న అంగన్‌వాడీలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు సైతం నష్టం కలిగించేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆ ఉద్యోగుల వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుంచి తొలగించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఈ పని సక్రమంగా చేయడం లేదు. దీంతో ఉద్యోగ విమరణ పొందిన ఉద్యోగులు వృద్ధాప్య పింఛనకు దరఖాస్తు చేసుకున్నా రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగిగా చూపిస్తుందంటూ దరఖాస్తును తిరస్కరిస్తున్నారు. ఐసిడిఎస్‌, డిఆర్‌డిఎ అధికారులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందంటూ అంగన్‌వాడీలు లబోదిబోమంటున్నారు. ఈ విధంగా ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు ఏలూరు జిల్లాలోనే దాదాపు 270 మందికిపైగా ఉన్నట్లు తెలుస్తోంది. సచివాలయాల్లో మార్పులు చేస్తున్నట్లు చెబుతున్నా, ఆచరణలో మాత్రం జరగడం లేదు.
బిల్లుల కోసం పడిగాపులు
అంగన్‌వాడీకేంద్రాల ఖర్చుల బిల్లులను సైతం ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దె కేంద్రాల్లో నడిచే అంగన్‌వాడీ సెంటర్లకు మున్సిపాలిటీల్లో రూ.నాలుగు వేలు, పట్టణాల్లో రూ.ఆరు వేలు, గ్రామాల్లో రూ.రెండు వేలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. గడిచిన ఐదునెలలుగా కేంద్రాల అద్దెలకు సంబంధించిన బకాయిలు ఇవ్వడం లేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు బిల్లుల బకాయిలు రెండేళ్లుగా ఇవ్వడం లేదు. కూరగాయలు, వంటగ్యాస్‌, రవాణా బకాయిలు వంటివి నాలుగు నెలలుగా ఇవ్వడం లేదు. దీంతో అంగన్‌వాడీ ఉద్యోగులు సొంత సొమ్ములు ఖర్చుచేయలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇక గర్భిణులకు, బాలింతలకు సంబంధించిన వివరాలను ఫోన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. ఫోన్లు పనిచేయక, చీటికీమాటికీ వెర్షన్లు మార్చడంతో ఉద్యోగులు నలిగిపోతున్నారు. ఫోన్‌ సమస్యలను ఏఒక్కరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా జిల్లాల విభజనతో కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలను వేరే ప్రాజెక్టులో విలీనం చేశారు. అందులో భాగంగానే పోలవరం మండలానికి సంబంధించిన 78 కేంద్రాలను కొయ్యలగూడెం ప్రాజెక్టులో కలిపారు. వీలినమైన కేంద్రాల వివరాలు ప్రాజెక్టుకు చేరలేదంటూ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలా అనేక సమస్యలతో అంగన్‌వాడీ సిబ్బంది ఆర్థికంగా నలిగిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని అంగన్‌వాడీలు ముక్తకంఠంతో కోరుతున్నారు.