Sep 27,2023 21:13

సాలూరురూరల్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద రాస్తారోకో చేస్తున్న అంగన్వాడీలు

ప్రజాశక్తి-సాలూరు రూరల్‌ : అంగన్వాడీల అరెస్టును, పోలీసుల నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఐసిడిఎస్‌ సాలూరు రూరల్‌ కార్యాలయం వద్ద బుధవారం ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు నారణమ్మ, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామన్న హామీని మరిచిపోయిందన్నారు. ఉద్యోగ భద్రత ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారని గుర్తుచేశారు. సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా, రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలియజేయడానికి విజయవాడ వెళ్లిన వారిని నిర్బంధించడం దారుణమన్నారు. అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలన్నారు. సెక్టార్‌ నాయకులు పార్వతి, పోలమ్మ, సుజాత, శాంత, జానకి, సీనియర్‌ నాయకులు కమలమ్మ, బోడెమ్మ తదితరులు పాల్గొన్నారు.
కొమరాడ : కొమరాడలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు కె.సాంబమూర్తి మాట్లాడారు. అనంతరం సూపర్వైజర్‌ అరుణ, శారదకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు సిరికి అనురాధ, జయమ్మ, అనురాధ, మంగమ్మ, జ్యోతి, పార్వతి పాల్గొన్నారు.
పార్వతీపురం టౌన్‌ : అంగన్వాడీల అరెస్టులను ఖండిస్తూ పట్టణంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, జిల్లా నాయకులు వి.ఇందిర ఆధ్వర్యంలో అంగన్వాడీలు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐసిడిఎస్‌కు బడ్జెట్‌ పెంచాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్నా వేతనాలు ఎక్కువ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటి అమలు చేయాలన్నారు. రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎం.గౌరి, గౌరిమణి, రాజేశ్వరి, రాధిక, దేవి, వరలక్ష్మి పాల్గొన్నారు.