Feb 19,2021 10:03

అమెరికా: నాసా ప్రయోగించిన పెర్స్‌ర్వెన్స్‌ రోవర్‌ అంగారకుడిపైకి అడుగు పెట్టింది. 7 నిమిషాల గండాన్ని దాటుకుని విజయవంతంగా దిగినట్లు నాసా ధ్రువీకరించింది. దీంతో నాసా జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబరేటరీ ప్రధాన కార్యాలయంలో ఆనందం నెలకొంది. గురువారం మధ్యాహ్నం 3.55గంటలకు రోవర్‌ అంగారక గ్రహాన్ని చేరిందని నాసా చీఫ్‌, భారత సంతతి శాస్త్రవేత్త స్వాతి మోహన్‌ ప్రకటించారు. అలాగే మార్స్‌ ఉత్తర అర్ధగోళంలోని జెజెరో బిలం నుండి ప్రిజర్వెన్‌ తీసిన ఫొటోను నాసా అసోసియేట్‌ అడ్మినిస్ట్రేటర్‌ థామస్‌ జురుబుర్‌చెన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు.
అంగారకుడిపై దిగిన రోవర్లలో పెర్స్‌ర్వెన్స్‌ ఐదోది. 1997లో తొలిసారి మొదటి రోవర్‌ దిగింది. ఈ ఐదూ కూడా నాసానే ప్రయోగించింది. ఏడు అడుగుల రోబోటిక్‌ చేయి, 19 కెమెరాలు, రెండు మైక్రోఫక్షన్లు వంటి ప్రత్యేక పరికరాలు ఈ రోవర్లలో ఉన్నాయి. అంగారక గ్రహంపై ఉన్న సూక్ష్మజీవుల ఆనవాళ్ల గుర్తింపు, వాతావరణ పరిస్థితులను పెర్స్‌ర్వెన్స్‌ అధ్యయనం చేయనుంది. రానున్న వేసవి నుండి ఈ రోవర్‌ నుండి కొత వేశేషాలు ఆశించవచ్చు. 30రాతి, నేల నమూనాలను ఈ రోవర్‌ సేకరించనుంది. తిరిగి 2030లో భూమికి చేరుతుంది. భూమి అవతల మానవ నివాసయోగ్యముందా? అనే ప్రశ్నకూ బహుశా సమాధానం దొరుకుతుందేమోనని నాసా భూవిజ్ఞాన శాస్త్రవేత్త కేటి స్టాక్‌ మోర్గాన్‌ తెలిపారు.