Sep 04,2023 20:58

నాగావళి నదిలో ప్లేయికార్డులు పట్టుకొని నిరసన తెలుపుతున్న గిరిజనులు

కొమరాడ : గిరిజనుల ప్రాణాలు కాపాడలేని ఆంధ్ర రాష్ట్రం తమకు వద్దు అని ఒరిస్సా రాష్ట్రమే ముద్దు అని రెబ్బ గిరిజన గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఆంధ్ర వద్దు ఒడిస్సా ముద్దు అనే ప్లే కార్డులతో నాగావళి నదిలో గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రెబ్బ గ్రామస్తులు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా రాకపోకలు చేసేందుకు తమకు ఎటువంటి సదుపాయాలూ లేకపోవడం దురదృష్టకరమన్నారు. పక్కనే ఉన్న ఒడిస్సా రాష్ట్రం రోజురోజుకీ అభివృద్ధి జరుగుతుందని ఎపి మాత్రం అభివృద్ధి జరగడం లేదని వాపోయారు. సరిహద్దు ప్రాంతంలో ఉండడమే తాము చేసిన పాపమా అని ప్రశ్నించారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. తమ ప్రాణాలు అంటే ప్రభుత్వానికి, పాలకులకు, అధికారులకు లెక్క లేదా అని ప్రశ్నించారు. కనీసం ప్రమాదకర ప్రయోగాలు చేస్తున్న అనేక దారుణ ఘటనలు జరుగుతున్నా ఏ ఒక ప్రజాప్రతినిధి కానీ అధికారులు కానీ వచ్చి తమను పరామర్శించే పరిస్థితి కూడా లేదన్నారు. కనీసం గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సదుపాయం కూడా లేకపోవడంతో నరకయాతన పడుతున్నామన్నారు. మరోవైపు నాగావళి నదిపై వర్షాకాలంలో ప్రయాణాలు సాగించాలంటే బిక్కుబిక్కుమంటూ రావలసిన దయనీయ పరిస్థితి ఎదురవుతోందన్నారు. తక్షణమే రోడ్డు వంతెన సదుపాయం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వినతిపత్రాన్ని ందించారు. గిరిజనుల సమస్యలు పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న గిరిజనులకు సిపిఎం పార్టీ ఎప్పుడూ మద్దతు తెలుపుతుందని రాష్ట్ర నాయకులు మర్రాపు సూర్యనారాయణ, నాయకులు కొల్లి సాంబమూర్తి గిరిజనులకు సంపూర్ణ మద్దతు తెలిపారు.