ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్ : పుట్టపర్తి మండలంలోని పలు గ్రామాలు మూడు రోజులుగా విద్యుత్ సౌకర్యం అంధకారంలో మగ్గుతున్నాయి. మండల పరిధిలోని మార్లపల్లి, రాచువారి పల్లి ,బుగ్గపల్లి, కొట్లపల్లి ,నిడిమామిడి ,కొత్త నిడిమామిడి ,సురగానిపల్లి దండువారిపల్లి ,కత్తి వారి పల్లి, గాజులపల్లి ,గాజులపల్లి తాండ, బత్తలపల్లి, పైపల్లి గువ్వల గుట్టపల్లి, వెంకట గారి పల్లి ,కోనాపురం గ్రామాల్లో గత మూడు రోజుల నుండి విద్యుత్ సౌకర్యం లేక ప్రజలు విలవిలలాడిపోతున్నారు. గురువారం రాత్రి వీచిన గాలికి, కురిసిన వర్షానికి ఆయా గ్రామాల్లో దాదాపు 20 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి దాంతో విద్యుత్ లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే ఎండాకాలం ఉక్కపోత ఆపై విద్యుత్తు లేకపోవడంతో చిన్నారులు, వద్ధులు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.మూడు రోజుల నుండి రాత్రి వేళలో నరకయాతన అనుభవిస్తున్నట్లు గ్రామస్తులు వాపోయారు. ఆరుబయట పడుకుందామంటే దోమల బెడద భరించలేకున్నామంటున్నారు. ఇంట్లో ఉక్క పోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. విద్యుత్ అధికారులు శుక్రవారం ఉదయం నుండి మరమ్మత్తులు పనులు చేపట్టారని అత్యధిక సంఖ్యలో విద్యుత్ స్తంభాలు, చెట్లు పడిపోవడంతో మరమ్మతు పనులు పనులు ఆలస్యం అవుతున్నాయని చెబుతున్నారు. ఆదివారం నాటికి పునరుద్ధరణ పనులు పూర్తి అవుతాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. కానీ ఇప్పటికే గ్రామాల్లో తాగునీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు విద్యుత్ లేక బోర్లు పనిచేయకపోవడంతో తాగునీటి కోసం పట్టణాలకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని వారు వాపోతున్నారు. అంతేకాక గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేక సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్లు, మూగబోయాయి. పలువురు సెల్ఫోన్ సంబంధాలు లేకపోవడంతో పక్కన ఉన్న పెడపల్లి ,గోరంట్ల, కొత్తచెరువు, పుట్టపర్తి, గ్రామాలకు వెళ్లి తమ సెల్‌ఫోన్లకు చార్జింగ్ పెట్టుకున్నారు. పై పల్లి, బత్తలపల్లి, వెంకటగారి పల్లి గ్రామాల వద్ద విద్యుత్ అధికారులు కొత్త స్తంభాలను నాటి విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించడానికి కషి చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా బత్తలపల్లి వద్ద పడిన చెట్లను జెసిబిల సాయంతో తొలగిస్తున్నారు.










