ప్రజాశక్తి-తనకల్లు :తనకల్లులో ఆహ్లాదకరమైన వాతావరణంలో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశారని, అందులో పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని డాక్టర్ ముబసిర ఆదివారం తెలిపారు. అన్ని విభాగాలకు చెందిన వైద్యులను ప్రభుత్వం నియమించిందని, ఎక్స్ రే తప్ప మిగిలిన యంత్ర పరికరాలు వచ్చాయన్నారు. మహిళలు, గర్భిణుల కోసం గైనకాలజిస్టు అందుబాటులో ఉంటారని, మహిళలకు కుటుంబ నియంత్రణ(కు.ని)తో పాటు చిన్న చిన్న ఆపరేషన్లు(శస్త్రచికిత్స) చేయడానికి సర్జన్ సిద్ధంగా ఉంటారని తెలిపారు. ఫిజియోథెరపీ, రేడియాలజీ, తదితర సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. మండల పరిధిలో చాలా గ్రామాలు ఉన్నాయని, ఎక్కువ శాతం పేదలు నివసించే గ్రామీణ ప్రాంతాలు, తండాలు అనేకం ఉన్నాయని వారందరికీ వైద్య సేవలందించడానికి సిబ్బంది నిత్యం సిద్ధంగా ఉంటారన్నారు. ఎటువంటి ఖర్చు, పట్టణాలు, సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉచితంగా వైద్యం పొందవచ్చు అన్నారు. రాబోయే వర్షాకాలంలో దోమల ద్వారా రోగాలు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కావున దోమల నివారణలో భాగంగా మురుగు, వర్షం నీరు, నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమతెరలు వాడాలని సూచించారు.










